కాల్షీట్ల ప్రకారం ప్యాకేజీ స్టార్ వచ్చి మాట్లాడి పోతారు
పేదలకు మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి
నిజాంపట్నం లో మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్య మంత్రి జగన్ మోహన్
రెడ్డి
నిజాంపట్నం : 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు పేరు చెబితే ఒక్క
సంక్షేమ పథకం కూడా ప్రజలకు గుర్తుకు రాదని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా
చేశారు. మంగళవారం మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా
నిజాంపట్నంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సిఎం జగన్ నిప్పులు చెరిగారు.
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి చేసినట్లు ఎవరికి గుర్తుకు రాదని, బాబు పేరు
చెబితే వెన్నుపోటు మాత్రమే గుర్తుకు వస్తుందన్నారు. వెన్నుపోటు, మోసం,
కుతంత్రాలు మాత్రమే బాబు అనగానే గుర్తుకు వస్తాయని, పేదలకు ఏ మంచి చేయని
చంద్రబాబుకు ఎవరైనా ఎందుకు మద్దతిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు మరో వైపు
ఇంకొరు ఉన్నారని, రెండు సినిమాల మధ్య షూటింగుల్లో విరామంగా పొలిటికల్
మీటింగులు పెడతారని, పవన్ కళ్యాణ్‌ను సిఎం ఎద్దేవా చేశారు. బాబు కాల్షీట్ల
ప్రకారం ప్యాకేజీ స్టార్ వచ్చి మాట్లాడి పోతారని, ప్రభుత్వం మీద నాలుగు
రాళ్లు వేసి పోతారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతిలో
ఉంటారని, అధికారంలో పోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉంటారని, అవే వారి శాశ్వత
నివాసాలని ఆరోపించారు. రాష్ట్రం మీద, ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని, కనీసం
ఉండాలనే ఆలోచన కూడా వారికి లేదని విమర్శించారు. తాను ప్రతిపక్షంలో ఉండగానే
తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఉన్నానని, 2014-19 మధ్య కాలంలో సిఎంగా ఉన్న
సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్‌లో ప్యాలెస్ కట్టుకున్నారని
విమర్శించారు. దత్త పుత్రుడు, దత్త తండ్రి సిద్ధాంతం రాష్ట్రంలో దోచుకోవడం,
దోచుకున్న వాటిని పంచుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని విమర్శించారు.
పేదలకు మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారు.
పేద వారికి మంచి జరుగుతుంటే తట్టుకోలేక పోతున్నారని జగన్ ఆరోపించారు. గత
పాలకులు, వారికి మద్దతిచ్చే వారికి వైసీపీ ప్రభుత్వ చర్యలు నచ్చడం లేదన్నారు.
ప్రభుత్వానికి ప్రతిక్షణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం
పనిచేస్తుంటే, ఆ వర్గాలు ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు గుర్తుకు
వస్తారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
గుర్తుకు వస్తారని ఆరోపించారు. చంద్రబాబు పాలనకు, తన పాలనకు మధ్య తేడా
గుర్తించాలని ప్రజలను కోరారు. తాను చేసిన మంచిని, ప్రజల్ని, దేవుడిని
నమ్ముకున్నానని, ఏ మంచి చేయని చంద్రబాబు, చంద్రబాబు దత్తపుత్రుడు మాత్రం
పొత్తుల్ని, ఎత్తుల్ని, చిత్తుల్ని, కుయుక్తుల్ని నమ్ముకున్నారని ఆరోపించారు.
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదా…?
ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటారని, కోతలు
కోసే బాబుకు 175నియోజక వర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా లేదని ఎద్దేవా
చేశారు. కనీసం 175స్థానాల్లో పోటీ చేస్తే తన పార్టీకి రెండో స్థానంవస్తుందనే
నమ్మకం కూడా బాబుకు లేదన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 175
నియోజక వర్గాల్లో పోటీకి నిలిపే స్థితిలో కూడా లేరని విమర్శించారు.
చంద్రబాబుకు బహిరంగ సమావేశాలు పెట్టే దమ్ము కూడా లేక చిన్నచిన్న సందుల్లో
సమావేశాలు పెట్టుకుంటున్నారని, ఇరుకు సందుల్లో జనం చనిపోతుంటే వారి మీద
సానుభూతి కూడా చూపని లేదని విమర్శించారు. చంద్రబాబు వెంటిలేటర్ మీద ఉన్నాడని,
నలుగురు కలిసి లేపితే తప్ప లేవని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేగా కూడా జనం వద్దన్నారు
పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా కూడా వద్దు అని జనం
నమస్కారం పెట్టారని, పదేళ్ల క్రితం రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీని పెట్టిన
దత్తపుత్రుడు 175 నియోజక వర్గాల్లో కనీసం అభ్యర్థుల్ని పెట్టలేని స్థితిలో
ఉన్నాడని, ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటుకు, పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకునే
స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని కాకపోయినా, దోపిడిలో తనకు
కావాల్సిన వాటా వస్తే చాలంటున్నాడని, వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు
ఆలోచించాలని కోరారు. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం, దోచుకున్న దానిని
పంచుకోవడానికి ప్రతిపక్షాలు అన్ని కలుస్తున్నాయని, ఎన్ని కష్టాలు వచ్చినా,
అవమానాలు వచ్చినా ఇన్నేళ్లలో ఎప్పుడూ రాజీ పడలేదని చెప్పారు. ప్రజలే తన
ధైర్యమని, వారినే తాను నమ్ముకున్నానని జగన్ ధీమా వ్యక్తం చేశారు. చేసిన మంచి
మాత్రమే నమ్ముకున్నామని, చేసిన మంచిని మాత్రమే చెబుతున్నానని, మంచి జరిగితే
తనకు ప్రజలు సైనికుల్లా నిలబడాలని కోరారు.
బీజేపీతో పొత్తుకు ఎందుకు ఆరాటం
చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో తాను ప్రధానుల్ని, మంత్రుల్ని కలిస్తే ప్రతిసారి
బురద జల్లుతున్నారని, నిజం జీవితంలో వారు మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌తో
పొత్తులు పెట్టుకున్నారని, కమ్యూనిస్టులు, బిఎస్పీలతో పెట్టుకున్నది వారేనని
జగన్ విమర్శించారు. వివాహం చేసుకున్నది వారే, విడాకులు ఇచ్చేది వారేనని,
మళ్లీమళ్లీ విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునేది వారేనని జగన్ చురకలు వేశారు.
విపక్షాలు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు తన దత్త పుత్రుడుని కలిసి వెళ్ధామంటే చిత్తం ప్రభు అని దాసోహం
అంటాడని, విడివిడిగా వెళ్దామని చంద్రబాబు చెబితే అలాగే అంటాడని,చంద్రబాబుకు
ఏది మంచిదని భావిస్తే అలా చేస్తాడన్నారు. చంద్రబాబు పోటీ చేయెద్దంటే పవన్
కళ్యాణ్ జీ హుజుర్ అంటాడని, కమ్యూనిస్టులతో ప్రస్తుతానికి కలవమంటే అలాగే
చేస్తాడని, విడివిడిగా పోటీ చేసి, గాజువాక, భీమవరం పోటీకి రాము, మంగళగిరిలో
పోటీ చేయొద్దంటే అలాగే దత్తపుత్రుడు చేస్తాడన్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక
బీజేపీకి దగ్గర కావడం కోసం చంద్రబాబుకు చెప్పగానే బీజేపీ దగ్గర చేరమంటే చిత్తం
అంటూ పవన్ చేశాడని విమర్శించారు. బీజేపీకి విడాకులు ఇచ్చేయమంటే దత్తపుత్రుడు
విడాకులు ఇచ్చేస్తాడని, చంద్రబాబు ఎలా చెబితే అలా చేస్తాడని తీవ్ర ఆరోపణలు
చేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలైనా వేస్తారని,
రాజకీయాలకు విలువ ఉందా, విశ్వసనీయత ఉందా అని ప్రజలు ఆలోచించాలన్నారు. ఇలాంటి
గజ దొంగల ముఠాకు మిగిలిన వారు కూడా తాన తందాన అంటారన్నారు.
కర్ణాటకలో గెలిస్తే మీకేంటి
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి బీజేపీ ఓడితే చంద్రబాబు విజయమని చెబుతారని,
కర్ణాటకలో ఓడిన బీజేపీని ఏపీలో తమతో కలిసి రావాలని సిగ్గులేకుండా
కోరుతారన్నారు. ప్రతిపక్షాలది జగన్‌తో యుద్ధం కాదని జనంతో యుద్ధమని
గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో పెత్తందారులు ఓ వైపు, పేదలు మరోవైపు
ఉన్నారన్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో ఓటు
వేయకపోయిన పేదలకు మంచి జరగాలనే తపన తాపత్రయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98శాతం హామీలను నెరవేర్చిన ఘనత తమదని సిఎం జగ్
చెప్పారు. నాలుగేళ్లలో రెండు లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి వస్తే అదే డబ్బు
చంద్రబాబు హయంలో ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలు
ఆలోచించుకోవాలన్నారు. నిజాంపట్నం అభివృద్ధికి రెండున్నర కోట్లు కోరడంతో దానిని
మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలకు పది కోట్లు,
డ్రెయిన్లు, సిసి రోడ్లకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
దాదాపు 13 పనులకు సంబంధించి ప్రాధాన్యత వారీగా నిధులు ఇస్తామని సిఎం
ప్రకటించారు.