బుధవారం ఉదయం 11.38 గం.లకు మహా పూర్ణాహుతి కార్యక్రమం
యజ్ఞ కార్యక్రమానికి వినియోగిస్తున్న నెయ్యి కొనుగోలు ప్రక్రియ అంతా
పారదర్శకమే
యజ్ఞ తపస్సు వల్ల రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉంటారని పీఠాధిపతులు అనుగ్రహ భాషణం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడ : కనివినీ ఎరుగని రీతిలో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా మహా క్రతువు
నిర్వహిస్తున్నారని ప్రముఖ పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారని రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోని యజ్ఞవాటిక ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన
మీడియా పాయింట్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ దేవదాయ, ధర్మదాయ శాఖ
ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అష్టోత్తర శత కుండాత్మక (108)
చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం నాలుగవ రోజు
విజయవంతంగా కొనసాగిందన్నారు. యజ్ఞ తపస్సు వల్ల రాష్ట్ర ప్రజలు క్షేమంగా
ఉంటారని పీఠాధిపతులు అనుగ్రహభాషణం అందించారని మంత్రి తెలిపారు. యజ్ఞానికి
సంపూర్ణత్వం కలిగేలా ఐదు రోజుల పాటు రుత్వికులు, ఘనాపాటిలు, వేద పండితులచే
హోమాలు, అర్చనలు, పూజలు జరిగిన అనంతరం చివరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి స్వహస్తాలతో పండితులు నిర్ణయించిన సుముహూర్తాన ఉదయం 11.38 గం.లకు
మహా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం భగవంతుని అనుగ్రహ ప్రాప్తి
కోసం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ
ఘటనలు జరగకుండా భక్తుల సౌకర్యార్థం మొత్తం 35 కౌంటర్లలో యజ్ఞ ప్రసాదం, అన్న
ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. విజయవాడ, గుంటూరు నుండే
కాకుండా సమీప ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై యజ్ఞాన్ని తిలకించాలని
విజ్ఞప్తి చేశారు. నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం సప్త నదులు, మూడు
సముద్రాలు, ప్రత్యేకించి మానస సరోవరం నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో, కశ్మీర్
నుంచి తెప్పించిన సుగంధ ద్రవ్యాలతో, కుంకుమ పువ్వును, ప్రత్యేకించి కస్తూరి
కలిపిన జలంతో అంగ రంగ వైభవంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి విశేష అభిషేకం
జరిగిందన్నారు. ఆద్యంతం కార్యక్రమం కన్నుల పండువగా, అత్యంత వైభవోపేతంగా
రుత్వికులు నిర్వహించారన్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్థం
అనే చతురాగమశాల యందు ప్రత్యేకంగా రుత్వికులచే శాస్త్రోక్తంగా 108 కండాలలో
విశేష పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా పాంచరాత్రంలో
సుదర్శన హోమం, నరసింహ్మస్వామికి సంబంధించిన పూజలు గావించారన్నారు. వైదిక
స్మార్థం యాగశాలలో రాజశ్యామల అమ్మవారికి, వైఖానసం యాగశాలలో ప్రత్యేక పూజలు,
హోమాలు, శైవ యాగశాలలో తెలుగు, తమిళ సంప్రదాయాలకు సంబంధించిన హోమాలు, పూజలు,
విష్ణు, మహిళా భక్తులచే లలితా సహస్ర పారాయణములు, చతుర్వేద పారాయణములు
నిర్వహించామన్నారు. ఉదయం వీరశైవ సంప్రదాయ పీఠాధిపతులైన అనంతపురం జిల్లా
ఉరవకొండ గవిమఠ సంస్థానం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరిబసవ రాజేంద్ర
మహాస్వాములవారు మరియు కర్నూలు జిల్లా ఆదోని కల్లుమఠం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ
గురుసిద్ధస్వాములవారు విచ్చేసి యజ్ఞ మహోత్సవాన్ని చూసి నభూతో నభవిష్యతి
అన్నట్లు ఈ యజ్ఞం సాగుతోందని, ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని
రీతిలో సాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వమే దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో ఇంత మహా
యజ్ఞం నాలుగు ఆగమాలతో కొనసాగించడం చాలా సంతోషమని వారు అనుగ్రహభాషణము
చేశారన్నారు. సాయంత్రం శ్రీమహా విష్ణువు మోహనీ అవతారంలో భస్మాసురుని సంహరించే
ఇతివృత్తాన్ని తెలుపుతూ ప్రదర్శించిన మోహినీ భస్మాసుర సాంస్కృతిక ప్రదర్శన,
శ్రీ చింతా రవి బాలకృష్ణ కూచిపూడి నృత్యరూపకం, ఆముక్తమాల్యద కార్యక్రమాలు
ఆద్యంతం అలరించిందన్నారు. వేదాంత రాజగోపాల చక్రవర్తి అనుగ్రహ భాషణం ప్రతి
ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకొందన్నారు. ఈరోజు అధ్యాత్మిక శోభను సంతరించుకున్న
యాగశాలలో భక్తులకు అఖండ పుణ్య ఫల ప్రాప్తి కొరకు శ్రీశైల శ్రీ భ్రమరాంబ
మల్లిఖార్జున స్వామి వార్ల లీలా కళ్యాణమహోత్సవం జరిగిందన్నారు. మంగళవారం
భక్తులకు అభ్యుదయ పరంపరాభివృద్ధి కొరకు సింహాచల శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి
వార్ల కళ్యాణోత్సవం నిర్వహించనున్నామన్నారు. అమ్మవారికి అభిషేకం జరిగిన అనంతరం
పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదమంత్రోచ్ఛరణల మధ్య
రుత్వికులు, ఘనాపాటిలు, పండితులతో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ప్రజా సంక్షేమం కోసం ధార్మిక భావనతో
నిర్వహిస్తున్న మహాయజ్ఞం మరో రెండు రోజుల పాటు జరుగుతుందని, ఈ యజ్ఞంలో భక్తులు
సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు
పాత్రులు కావాలని, అమ్మవారి దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని
ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం వెల్లివిరియాలని, అధ్యాత్మిక
భావనతో, దేవుడిపై భక్తి, విశ్వాసంతో ఉండాలని, రాబోయే తరాలకు ధర్మ పరిరక్షణ
గురించి అవగాహన కల్పించాలన్నారు. మహా యజ్ఞంలో వినియోగించిన నెయ్యిపై కొందరు
అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. లోకం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర
సంక్షేమం కోసం రుత్వికులు ఆద్యంతం ఉత్సాహంతో, భక్తిప్రపత్తులతో తమ శక్తినంతా
ధారబోసి ఈ క్రతువును గావిస్తున్నారన్నారు. అలాంటి విశేషం కలిగిన ఈ యజ్ఞంలో
వాడే ద్రవ్యాలపై భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సబబు కాదన్నారు.
యజ్ఞంలో వినియోగించే పవిత్రమైన నెయ్యి భగవత్ సంకల్పంతో పొగ రూపంలో మేఘాలను
చేరి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పురాణాల్లో
ఆర్యులు చెప్పారని అంతటి పవిత్రమైన యజ్ఞంలో ధార్మిక పరిషత్, ఆగమ, అర్చక, వైదిక
పండితుల సలహా మండలి సూచనలతో, పారదర్శకంగా టెండర్లు వేసి, శ్రీ వేదిక్ గో
ఉత్పాద్ ఫౌండేషన్, గోధామ్ మహాపీట్, పత్ మేడ వారి ద్వారా రాజస్థాన్ నుంచి
తెప్పించిన స్వచ్ఛమైన దేశీయ ఆవుల నుండి తయారు చేసిన నెయ్యిని యజ్ఞం కోసం
వినియోగిస్తున్నామన్నారు. గతంలో హైదరాబాద్ శివారులో శ్రీరామనుజ సహస్రాబ్ది
ఉత్సవాల సమయంలో శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమం ఇదే సంస్థ నుండి ఇదే రకమైన
నెయ్యిని యాగము నిమిత్తం కొనుగోలు చేసిన ధర కంటే అతి తక్కువ ధరకే తాము
కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అధిక ధరకు నెయ్యిని కొన్నామన్న వార్తలు శుద్ధ
అబద్ధం. అవాస్తవం.. సంబంధిత వార్తలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి
స్థానిక డెయిరీ సంస్థలను సంప్రదించిన అనంతరం వారు దేశీయ ఆవుల పాల నుండి తయారైన
నెయ్యిని సరఫరా చేయలేమని చెప్పిన తర్వాతే రాజస్థాన్ నుంచి తెప్పించాలని
నిర్ణయించామన్నారు. స్వదేశీ జాతి ఆవులు కాకుండా జెర్సీ ఆవు పాల నుండి తయారు
చేసిన నెయ్యిని యజ్ఞయాగాదులలో వినియోగించరాదన్న వైదిక పండితుల, యాజ్ఞికుల
అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరణనిచ్చారు.
దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా
నిర్వహిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పండితులంతా
నిస్వార్థంగా, నిజాయితీగా, ఆగమశాస్త్ర నియామానుసారం రాత్రింబవళ్లు శ్రమించి
పూజలు నిర్వహిస్తున్నారన్నారు. యాగశాలలో రాజశ్యామల యజ్ఞం చేస్తుంటే రుత్వికుల
ముఖాల్లో తేజస్సు కనబడుతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని
ఉదయాభానుకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం భక్తులకు తీర్థ
ప్రసాదాలు ఇచ్చారు. భక్తులపై, పాత్రికేయులపై మానససరోవరం నుంచి తెచ్చిన పవిత్ర
జలాన్ని ప్రోక్షణ చేశారు. మీడియా సమావేశంలో దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ ఎస్.
సత్యనారాయణ, అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్, ఆర్ఎస్ డీ చంద్రశేఖర్ ఆజాద్,
శ్రీశైల దేవస్థాన పంచాంగ కర్త బొట్టు వీరభద్రస్వామి, యజ్ఞ కార్యక్రమాల ఇన్
ఛార్జి వేదాంత రాజ గోపాల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.