నరసింహారావు పాలెం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా
సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
విజయవాడ : వీరులపాడు మండలంలోని నరసింహారావు పాలెం గ్రామంలో గడపగడపకు -మన
ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం
అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్
మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు కొత్త
రూపు సంతరించుకొని కార్పొరేట్ పాఠశాల కంటే మిన్నగా దర్శనమిస్తున్నాయని
తెలిపారు. ప్రతి సామాన్యుడి, పేదవాడి బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలనే
ఉద్దేశ్యంతోనే వైయస్ జగన్ విద్యారంగంపై వేల కోట్ల ఖర్చుపెట్టి నాడు నేడు
కార్యక్రమంలో భాగంగా పాఠశాల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు అవసరమైన
ప్రతిదీ సమకూర్చేందుకు శ్రమిస్తున్నారని, కార్పొరేట్ పాఠశాలల మాదిరి ట్యాబులు
కూడా ఇచ్చారన్నారు. విద్యార్థుల చదువు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే అమ్మ
ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఇలాంటి పథకాలను అమలు
చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా వైద్య రంగంలో కూడా సమూల మార్పులకు శ్రీకారం
కొత్త సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చెరువచేసేలా వైయస్
జగన్ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్
క్లినిక్ లు, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయటం, నూతనంగా
108,104 వాహనాల ప్రవేశపెట్టడం, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం,
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం
జరిగిందన్నారు. కానీ గత తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ
విద్యను, ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసేలా పరిపాలన సాగించారని గుర్తు
చేశారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేలా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వ
ఆసుపత్రులను సైతం గాలికి వదిలేసారన్నారు. తన బినామిలైన కార్పోరేట్ సంస్థలకు
మేలు చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వ విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారని
చెప్పారు. ప్రజలకు మేలు కలిగేలా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్
మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ బొమ్మిశెట్టి దుర్గాదేవి, బొమ్మిశెట్టి భాస్కరరావు, పచ్చాల
కోటేశ్వరరావు, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి
కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మండల కన్వీనర్ ఆవుల
రమేష్ బాబు, ఎంపిటిసి శీలం రమణారెడ్డి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు.