విజయవాడ : కర్ణాటక రాష్ట్రంలో విజయం సాధించడం వెనుక ఉన్న మీ కృషి,
చిత్తశుద్ధిని మేము గుర్తించాం. రానున్న ఎన్నికల్లో మా రాష్ట్రంలో కూడా మీరు
మాకు వివిధ రూపాల్లో సహకరించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జై రాం
రమేష్‌ను ఏపిసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కోరారు. అదే సమయానికి
చెన్నగిరి నియోజకవర్గం శాసనసభ్యులు శివగంగ బసవరాజు రావడంతో
ఆయనను కూడా రుద్రరాజు అభినందించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన విధానాన్ని
మేము కూడా మా రాష్ట్రంలో స్ఫూర్తిగా తీసుకుని క్షేత్రస్థాయిలో సమిష్టిగా
పార్టీ గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని శివగంగ బసవరాజుతో
గెలిచిన గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో భారీ
మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బెంగళూరులో ఆదివారంనాడు పలువురు కాంగ్రెస్
పార్టీ ఉన్నతస్థాయి నాయకులను గిడుగు రుద్రరాజు మర్యాదపూర్వకంగా కలిసి
అభినందనలు తెలిపారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న చెన్నగిరి నియోజకవర్గంలో
పార్టీ గెలుపు కోసం ఇటీవల ఏపిసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
విస్త్రతంగా ప్రచారం చేసిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ శివగంగ
బసవరాజు గిడుగు రుద్రరాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపిసీసీ తరఫున
విస్త్ర ప్రచారం చేయడం ఫలితంగా శివగంగ బసవరాజు చెన్నగిరి
నియోజకవర్గంలో 18వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.