మార్గాని భరత్
కొవ్వూరు : భారత దేశ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
విగ్రహాన్ని మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్
లు ఆవిష్కరించారు. ఆదివారం కొవ్వూరులో దొమ్మేరు రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద ఈ
విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం గౌడ జనభేరి బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో
మంత్రులు, ఎంపీ, వక్తలు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ సమాజానికి చేసిన సేవలు,
రాచరికపు వ్యవస్థలో ఆయన పాలించిన తీరును కొనియాడారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
మాట్లాడుతూ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను లండన్ లో రెండు పుస్తకాలు
రాశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత గౌడలకు అధిక
ప్రాధాన్యత జగనన్న ప్రభుత్వంలోన దక్కిందని తెలిపారు. గౌడ కులానికి మంత్రి
వర్గం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ
ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్
స్థానం కూడా బలహీన వర్గాలకు కేటాయించిన నాయకుడు కూడా జగన్ మోహన్ రెడ్డే అని
తెలిపారు. నేషనల్ హైవే పక్కన లక్షలాది మందికి కనిపించేలా కొవ్వూరు మెయిన్
సెంటర్లో విగ్రహాం ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితకు
అభినందనలు తెలిపారు.
హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
విగ్రహావిష్కరణ నా నియోజక వర్గంలో జరగడం ఆదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు
మండి కత్తి పట్టిన వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. మహత్మా జ్యోతీరావు ఫూలే
కంటే ముందు సామాజిక న్యాయం అమలు చేసిన పాపన్నకు సరైన గుర్తింపు రాలేదన్నారు.
గత ప్రభుత్వాలన్నీ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని, కానీ జగన్ మోహన్
రెడ్డి గారి హాయాంలో బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్
అని నిరూపించారన్నారు. బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారానికి దగ్గర చేసింది
సీఎం జగన్ అని కొనియాడారు. డా. బీఆర్ అంబేద్కర్, పూలే, పాపన్న గౌడ్ ఆశయాలకు
అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాజమండ్రి
పార్లమెంట్ స్థానంలో గతంలో ఎప్పుడూ.. అగ్రవర్ణాలకే కేటాయించేవారని, కానీ జగన్
మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా బీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బీసీలకు
కేటాయిస్తామని చెప్పి ఆచరించి చూపారని హోంమంత్రి తెలిపారు.
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బహుజనుల అందరికీ మహారాజు కింద 16వ శతాబ్ధంలోనే
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బీజం వేశారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో
ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అంత పేరు, ప్రఖ్యాతలు
దక్షిణ భారతదేశంలో పాపన్న గౌడ్ కి ఉన్నాయని, శివాజీకి సమకాలికుడు సర్ధార్
సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అందరూ ఐక్యమత్యంతో
ముందుకెళ్లాలని భరత్ పిలునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గౌడ
నాయకులు తాత కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.