1,200 మందికి పైగా తరలివచ్చిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు
క్యాంప్ లో ఉచితంగా రూ.10 వేల విలువైన 17 రకాల వైద్య పరీక్షలు
22 ప్రధాన ఆస్పత్రుల వైద్య నిపుణులచే సలహాలు, సూచనలు
జర్నలిస్టులకు వైద్య సేవలందించిన ఆస్పత్రుల యాజమాన్యాలకు మెమెంటోలు అందజేసిన
డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరింద్రప్రసాద్
త్వరలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలలో జర్నలిస్టులు, వారి కుటుంబ
సభ్యులకు ఉచిత వైద్య శిబిరాలు
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ : జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏర్పాటు
చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని సమాచార పౌర సంబంధాల శాఖ
కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర
సంబంధాల శాఖల సౌజన్యంతో విజయవాడలోని ఆంధ్రా లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం మే 13, 14 తేదీల్లో నిర్వహించిన
క్యాంపులో 1,200 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని అవసరమైన
వైద్య సేవలు పొందారన్నారు. తొలిరోజు వైద్య పరీక్షలకు, రెండో రోజు వైద్యులచే
కన్సల్టేషన్ కు భారీ ఎత్తున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజరై 22
ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే వైద్య సేవలు పొందారని
వెల్లడించారు. ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో మామోగ్రామ్, హృద్రోగ సంబంధిత టెస్ట్
లు, ఈసీజీ, 2డీఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్(టిఎంటీ), ఆల్ట్రా సౌండ్ స్కానింగ్,
సీబీపీ, లివర్ పంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొపైల్ టెస్ట్, థైరాయిడ్, డయాబెటిక్
టెస్ట్ లు, ఎక్స్ రే, కళ్లు, డెంటల్ పరీక్షలు వంటి తదితర 17 రకాల వైద్య
పరీక్షలు నిర్వహించామన్నారు. ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి
పరిష్కరించుకోవడం ద్వారా జర్నలిస్టులు మరింత మెరుగైన జీవితాన్ని
కొనసాగించాలన్నదే తమ తపన అన్నారు. కుటుంబ సమస్యలు పక్కనబెట్టి, ఆరోగ్య
సమస్యలు ఫణంగా పెట్టి సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టుల ఆరోగ్యాలు బాగుండాలని
కమిషనర్ ఆకాంక్షించారు.
హెల్త్ క్యాంపులో నిర్ధారిత పరీక్షలు చేసిన పిదప అత్యవసర వైద్య సేవలు,
దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సాయం పొందాల్సి వస్తే ఆరోగ్యశ్రీ అనుబంధిత
ఆస్పత్రుల(రిఫరల్ హాస్పిటల్)కు వెళ్లడానికి జర్నలిస్ట్ హెల్త్ కార్డు
తప్పనిసరి కావున కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు హెల్త్
కార్డు పొందడానికి వీలైనంత త్వరగా రూ.1,250 చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం
తరపున మరో రూ.1,250 చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య,
కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి ఎం.టి కృష్ణబాబు రెండో రోజు కూడా
హెల్త్ క్యాంపును సందర్శించి వైద్యులు అందిస్తున్న వైద్యసాయాన్ని స్వయంగా
పరిశీలించారు. ఇంత పెద్ద ఎత్తున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ భారీ
స్పందనతో భవిష్యత్ లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు, వారి
కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని కృష్ణబాబు తెలిపారు.
జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్
క్యాంపును వినియోగించుకున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా కమిషనర్ తుమ్మా విజయ్
కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపులో నిరంతరాయంగా వైద్య సేవలందించిన
ఆరోగ్యశ్రీ సిబ్బంది మరియు పాల్గొన్న 22 ఆస్పత్రుల యాజమాన్యాలు, సిబ్బందికి
ప్రత్యేకంగా కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపులో
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించిన 22 ఆస్పత్రుల
యాజమాన్యానికి డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర
ప్రసాద్ చేతుల మీదుగా మెమొంటోలు అందజేశారు.