సర్పంచులకు, ఎంపీటీసీ లకు రూ.15000 వేలు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ.30
వేలు గౌరవ వేతనం ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్.
రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సర్పంచుల నిధులు రూ,, 8660 కోట్లను వెంటనే
తిరిగి ఇవ్వాలి : లక్ష్మీ ముత్యాలరావు
అనకాపల్లి : ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్
ఆదేశానుసారం ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లిలోని
కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర, వై.ఎం.వి.ఏ కమ్యూనిటీ హాల్ నందు ఉమ్మడి విశాఖ
జిల్లా సర్పంచుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా వై.వి.బి.
రాజేంద్రప్రసాద్ వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వై.వి.బి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్రంలో
గ్రామానికి సేవ చేద్దామని ఎన్నో ఆశలతో, ఆశయాలతో సుమారు రెండు సంవత్సరాల
క్రితం ఎన్నికై వచ్చిన సర్పంచులు పలు ఇబ్బందులు పడుతున్నారని, 73,74వ
రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా సర్పంచులకు
రాజ్యాంగబద్ధంగా,చట్టబద్ధంగా,న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన
నిధులు, విధులు అధికారాలను ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ( 2018-2019
నుంచి 2021-2022 వరకు) 14,15 వ ఆర్థిక సంఘం నిధులు రూ,,8660 కోట్లను దారి
మళ్లించేసుకొని తన సొంత అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడంతో గ్రామాలు
నిర్వీర్యమైపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పై రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
అలాగే క్రొత్తగా కేంద్రం నుంచి రావాల్సిన రూ,,2020 కోట్ల రూపాయలు
రాష్ట్రానికి వచ్చినాయా ? ఒకవేళ వస్తే గతంలో రూ,,8660 కోట్ల ను దారి మళ్లించి
వేసినట్లే ఈ డబ్బులను కూడా దారి మళ్లించి మీ సొంత అవసరాలకు వాడుకున్నారా
చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
అలాగే “రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన రూ.8660 కోట్లు మా సర్పంచులకు
తిరిగి ఇవ్వాల్సిందేనని వై.వి.బి. రాజేంద్రప్రసాద్, వానపల్లి లక్ష్మీ
ముత్యాలరావు డిమాండ్ చేశారు. అలాగే మా సర్పంచుల న్యాయబద్ధమైన డిమాండ్ అయిన
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు, క్లాప్ మిత్రాల జీతాలు
సర్పంచులు ఎవరూ కట్టవద్దని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర
అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఆం.ప్ర. సర్పంచుల సంఘం రాష్ట్ర
అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు పిలుపునిచ్చారు. పాత పద్ధతిలోనే
గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు, క్లాప్ మిత్రాల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే
చెల్లించాలని, గ్రామ సచివాలయాల పేరుతో ఎమ్మెల్యేలకు ఇస్తున్న 20 లక్షల రూపాయలు
గ్రామ పంచాయతీలకు ఇచ్చి సర్పంచుల ద్వారానే అభివృద్ధి చేయాలని కోరారు.
గ్రామ పంచాయతీల, సర్పంచుల ఆధీనంలోకి గ్రామ సచివాలయాలను వాలంటీర్లను తీసుకు
రావాలని, ప్రస్తుతం వారు స్వతంత్ర శాఖ ఉద్యోగులుగా గ్రామ పంచాయతీలకు,
సర్పంచులకు సమాంతర వ్యవస్థగా పని చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. 73,74
వ రాజ్యాంగ సవరణ చట్టం లోని ఆర్టికల్ 243g, 11వ షెడ్యూల్లో గ్రామ పంచాయతీలకు
ఇచ్చిన 29 అంశాలు , శాఖలు ప్రకారం గ్రామ సచివాలయాలు, సచివాలయ సెక్రటరీలు,
గ్రామ వాలంటీర్లు ను సర్పంచుల ఆధ్వర్యంలోనే పని చేయించాలన్నారు. ఆ 29 శాఖలకు
చెందిన సిబ్బందిని, నిధులను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే
పర్యవేక్షణ అధికారాలను మా గ్రామ ప్రభుత్వాలకు, సర్పంచులకు ఇస్తూ గ్రామ పంచాయతీ
సిబ్బంది గానే వారిని మార్పుచేసి వారికి జీతాలు, సెలవులు ఇచ్చే అధికారంకూడా
సర్పంచులకు ఇస్తూ,ఈ సమాంతర వ్యవస్థన, శాఖను రద్దు చేస్తూ తగిన స్పష్టమైన
ఆదేశాలను, జీవోలను జారీ చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వం పాలనతో మా
సర్పంచుల ఆత్మ అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని గౌరవ, మర్యాదలను కాల
రాసినట్లేననన్నారు.
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన సర్పంచుల కంటే తాత్కాలిక ఉద్యోగులయిన వాలంటీర్ల కే
ఎక్కువ అధికారాలు ఉండటం సిగ్గుచేటైన విషయం. పంచాయతీ రాజ్ అధికారాలను సచివాలయాల
వాలంటీర్లు, వ్యవస్థ హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, జాతీయ ఉపాధి
హామీ పథకం కింద వచ్చే కేంద్ర నిధులను ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం, కేంద్ర
ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు,
సర్పంచులకుఇవ్వాలని, సుమారు 12000 మైనర్ గ్రామ పంచాయతీలకు 1984 నుంచి గత
ప్రభుత్వాలు ఇచ్చిన మాదిరే వీధి దీపాలకు, తాగునీటి పథకాలకు, గ్రామ పంచాయతీ
ఆఫీసులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. బిల్లులు కట్ చేసుకోకూడదని, పాత బకాయిలుగా
చూపిస్తున్న సుమారు రూ.10,000 కోట్ల విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలని,
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలకు పంపించిన 14వ ఆర్థిక
సంఘం నిధులు 2018 – 19 సంవత్సరానికి రూ,,1729.23 కోట్లు. 2019 – 20
సంవత్సరానికి రూ.2336.58 కోట్లు, 15 వ ఆర్థిక సంఘం నిధులు 2020 – 21
సంవత్సరానికి రూ.2625 కోట్లు. 2021 – 22 సంవత్సరానికి రూ.1938 కోట్లు మొత్తం
కలిపి రూ.8660 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీల సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో
కనిపించడం లేదు. జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం
దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వాడి వేసుకుంది. అదేమంటే
విద్యుత్ బకాయిల కింద జమ చేసుకున్నామని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. ఇది
అన్యాయం.
పంచాయతీలకు 1984 నుంచి ఉచితంగా విద్యుత్తు ని అన్ని ప్రభుత్వాల సీఎంలు
ఎన్టీఆర్, చంద్రబాబు, వై.యస్.ఆర్ లు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కట్టమంటే ఎలా?
కనుక ఇది ప్రభుత్వ దోపిడి, ఇది అన్యాయం. కనుక మా నిధులు మాకు వెంటనే ఇవ్వాలి.
ఆ మొత్తం 8660 కోట్ల రూపాయల నిధులను మా గ్రామ పంచాయతీలకు తిరిగి జమ చేయాలని,
సర్పంచ్ కన్నా గ్రామ వాలంటీర్లకు అంగన్వాడీ ఆయాలకే గౌరవ వేతనాలు ఎక్కువగా
ఇస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గౌరవ సలహాదారులకైతే నాలుగు లక్షల రూపాయల
వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం విపరీతంగా ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన
నేపథ్యంలో సర్పంచ్ కు, ఎంపీటీసీలకు 15 వేల రూపాయలు, ఎంపీపీ లకు, జడ్పీటీసీలకు
30 వేల రూపాయలు, మున్సిపల్ కౌన్సిలర్లకు 20 వేల రూపాయలు, కార్పొరేటర్లకు 30
వేల రూపాయలు, మున్సిపల్ చైర్మన్ లకు లక్ష రూపాయలు, కార్పొరేషన్ చైర్మన్ లకు
రెండు లక్షల రూపాయలు, జిల్లా పరిషత్ చైర్మన్ లకు రెండు లక్షల రూపాయలు గౌరవ
వేతనాలు ఇవ్వాలని, తదుపరి మొదలగు మొత్తం 12 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం
వెంటనే పరిష్కరించాలని, పైన పేర్కొన్న డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని
సర్పంచులు అందర్నీ రాజకీయాలకతీతంగా కలుపుకొని ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం
చేస్తామని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ సమావేశంలో చింతకాయల సుజాత ముత్యాలు ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘం
అధ్యక్షులు, దాడి ఎరుక నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్
కన్వీనర్, బిర్రు ప్రతాపరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ ఛాంబర్, బొర్రా నాగరాజు రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ
రాజ్ ఛాంబర్, సన్యాసినాయుడు ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల
సంఘం,వానపల్లి ముత్యాలరావు కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్,
చింతకాయల ముత్యాలు ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆనెపు
రామకృష్ణ నాయుడు ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ , సింగంశెట్టి
సుబ్బరామయ్య ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, చుక్కా ధనుంజయ
యాదవ్ అధ్యక్షులు చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ చాపల మాసేను రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.