గుంటూరు: గ్రామీణ ప్రాంత పేదలకు న్యాయం పట్ల, కనీస అవసరాల పట్ల వారికి అవగాహన
కల్పించాల్సిన భాధ్యత న్యాయవాదులపైన ఉందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఆదివారం వడ్డేశ్వరంలోని
కెఎల్ విశ్వవిద్యాలయంలో ఎపి బార్ కౌన్సిల్ అధ్వర్యంలో రెసిడెన్షియల్
ఓరియంటేషన్ ప్రోగ్రాం పేరుతో ఏర్పాటు చేసిన మూడు రోజుల న్యాయవాదుల శిక్షణా
శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని
ప్రారంభించారు.
ఎపి బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు సభాధ్యక్షత వహించారు. కెఎల్
విశ్వవిద్యాలయం చైర్మన్ కోనేరు సత్యన్నారాయణ, హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్
ఆకుల వెంకట శేష సాయి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి
న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అతిథులకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్
లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాన
న్యాయ మూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయవాదులనుద్దేశించి మాట్లాడుతూ
న్యాయవాద వృత్తి ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనదని అన్నారు. న్యాయవాద వృత్తి
లోకి నూతనంగా వచ్చిన వారికి చట్టంలోని కీలకమైన అంశాలతోపాటు కమ్యునికేషన్
స్కిల్స్ కూడా అవసరమన్నారు. దాని వలన అటు కక్ష్య దారుల నుండి సరైన సమయంలో
సరైన సమాచారాన్ని రాబట్టుకుని పిటిషన్ తయారు చేయడానికి ఎంతగానో
ఉపయోగపడుతుందన్నారు.
కోర్టు గదిలో కూడా న్యాయవాదుల హావబావాలు చాలా కీలకమన్నారు. కొన్ని సమయాలలో
న్యాయవాదులు తయారు చేసిన పిటిషన్లలో న్యాయం ఎంతమేర ఉందో న్యాయమూర్తులు చాలా
త్వరగా పసిగట్టగలరని అన్నారు. కెఎల్ విశ్వవిద్యాలయం చైర్మన్ కోనేరు
సత్యన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన న్యాయవాదులకు తమ
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆతిథ్యమివ్వడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు.
అయితే సమాజంలో ఎంతో కీలకమైన వారు న్యాయవాదులు అని పేర్కొన్నారు. తమ
విశ్వవిద్యాలయం తరుపున చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ద్వారా ప్రతీ
విద్యార్ధి పదిహేను రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి గ్రామీణ పరిస్థితుల పైన
అధ్యయనం చేసి గ్రామీణుల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అడుగులు
వేస్తున్నామన్నారు. న్యాయవాదులు కూడా ఆ దిశగా ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాల
త్వరగా అభివృద్ది చెందుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.
తమ విశ్వవిద్యాలయం తరుపున వీలైనంత వరకు గ్రామీణ ప్రాంత పేదలకు సేవ చేయడానికి
కృషి చేస్తున్నట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయ మూర్తి
జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి మాట్లాడుతూ న్యాయవాద వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం
ఉందన్నారు. వాద, ప్రతివాదులకు న్యాయం చేయడం కోసం న్యాయవాదులు ఎల్లవేళలా తమ
వంతు కృషి చేస్తారని అన్నారు. న్యాయ వ్యవస్థలో న్యావాదుల పాత్ర ఎంతో
కీలకమన్నారు. వృత్తి నైపుణ్యాలను మరింతగా మెరుగు పరుచుకుని ఇంకా బాగా
రాణించాలని ఆకాంక్షించారు. ఎపి బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు
మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న ఓరియంటేషన్ ఎంతో ఆహ్లాదకరమైన
వాతావరణంలో జరగడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమకు వసతి కల్పించిన కెఎల్
విశ్వవిద్యాలయ చైర్మన్ కోనేరు సత్యన్నారయణ కి ధన్యవాదాలు తెలిపారు.
న్యాయకళాశాల విద్యార్ధులు నృత్య రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను
అలరించారు. ఈ కార్యక్రమంలో కెఎల్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సులర్ డాక్టర్
జి.పార్ధసారది వర్మ, ప్రో వైస్ చాన్సులర్ డాక్టర్ ఎన్.వెంకట్ రామ్,
రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, స్కిల్ అభివృద్ది విబాగ డీన్ డాక్టర్
ఎ.శ్రీనాధ్, విద్యార్ధి సంక్షేమ విబాగ డీన్ డాక్టర్ సిహెచ్.
హనుమంతరావు, హెచ్.ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు, న్యాయకళాశాల అద్యాపకులు
పాల్గొన్నారు.