పాషా
చెత్త పన్ను వసూళ్ళ టార్గెట్ల నుండి విముక్తి కల్పించాలి
శానిటేషన్ సెక్రటరీలకు ఇతర వార్డు సచివాలయ ఉద్యోగుల మాదిరిగా పని వేళలు
కల్పించాలి.
వార్డు శానిటేషన్ సెక్రటరీలకు యూజర్ చార్జీల టార్గెట్ల పేరిట
వేధింపులు,సస్పెన్షన్లు ఆపాలని పురపాలక శాఖ అధికారులకు విజ్ఞప్తి
వార్డు శానిటేషన్ కార్యదర్శులపై వేధింపులు ఆపాలి
ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా,ఉన్నత విద్యావంతులైన వార్డు శానిటేషన్
సెక్రటరీల నియామకం యొక్క ప్రధాన ఉద్దేశానికి తూట్లు పొడుస్తున్నారు.
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్న కొందరు అధికారులు
చేస్తున్న వేధింపులు, కుట్రలను అరికట్టాలి
వీరిపై పురపాలక శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి.
వార్డు శానిటేషన్ సెక్రటరీలు సచివాలయ ఉద్యోగులు కదా?వీరికే ఎందుకు ఇంత కష్టం
కారణం ఏమిటీ?*
మొండి బకాయిలున్న కొంతమంది ప్రజలు యూజర్ చార్జీలు (చెత్త పన్ను)చెల్లించకపోతే
శానిటేషన్ సెక్రటరీలను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం
విజయవాడ : కొంతమంది అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని,
ఇటువంటి పరిస్థితులు కొనసాగిస్తే ఉద్యోగుల హక్కులు కాపాడుకోవడంకోసం చట్ట
ప్రకారం ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుకుంటామని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్
ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా అన్నారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నియమితులైన వార్డు
పర్యావరణ, పారిశుధ్ధ్య కార్యదర్శులకు జాబ్ చార్ట్ ప్రకారం విధులు
కేటాయించాలని,యూజర్ చార్జీల(చెత్త పన్ను)వసూళ్ళ నుండి విముక్తి కల్పించాలని,
అనేక ప్రాంతాల్లో టార్గెట్ల పేరుతో వార్డు పారిశుద్ధ్య కార్యదర్శులపై అక్రమంగా
చర్యలు తీసుకొని వారికి తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని,అధికారులు
వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. యూజర్ చార్జీల వసూళ్ళకు వెళ్తున్న
వార్డు పారిశుధ్ధ్య, పర్యావరణ కార్యదర్శులపై ప్రజల నుండి తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటూనే వసూళ్ళు చేస్తున్నప్పటికీ కొంతమంది పురపాలక అధికారులు తీవ్ర
వేదనకు గురి చేస్తున్న సంఘటనలు ఉద్యోగులు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో తమ
దృష్టికి తీసుకొని వచ్చారని, ఇక ఇటువంటి వేధింపులు ఆపాలని, అలా చేయని పక్షంలో
అటువంటి వారిపై శాఖా పరమైన చర్యలకు ఉన్నంతధికారులకు ఫిర్యాదు చేస్తామని
తెలిపారు.
అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థలో ఇతర ఉద్యోగులకు 10:30 గంటలకు
కార్యాలయ పని వేళలు ప్రారంభం అయితే పారిశుధ్ధ్య, పర్యావరణ కార్యదర్శులుగా
నియమితులైన వీరికి మాత్రం ప్రత్యేక టైమింగ్స్ తో ఉదయం 5 గంటలకే విధులకు హాజరు
కావాలని గత ముడున్నర సంవత్సరాలనుండి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మరి
కొన్ని ప్రాంతాల్లో పురపాలక అధికారులు మరో అడుగు ముందుకేస్తూ వీరికి ఎటువంటి
సెలవులు లేవంటూ ఆదేశాలు జరీచేయడం మరింత బాధాకరం,కొసమెరుపు ఏమంటే వీరిని
అభ్యంతరకర భాషతో దుర్భాషలాడుతున్న సంఘటనలు అనేకమన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే,
మహిళా పారిశుధ్ధ్య కార్యదర్శుల ఆవేదన వర్ణణాతీతం,ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే
వీరి విధులు సాయంత్రం యూజర్ చార్జీల రోజువారీ టార్గెట్ పూర్తి అయ్యేవరకు ఏ
సమయం అవుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. ఈ పరిస్థితి నుండి విముక్తి
కల్పించి ప్రశాంత వాతావరణంలో జాబ్ చార్ట్ ప్రకారం వీరికి విధులు
కేటాయించి,జనన,మరణ ధ్రువీకరణ పత్రాల జారీ,ట్రేడ్ లైసెన్స్ ల జారీ బాధ్యతలు
అప్పగించాలని,ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగా పనివేళలు కల్పించాలని, అధికారుల
వేధింపులు అరికట్టాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా డిమాండ్ చేశారు. ఈ
సందర్భంగా వీరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆలోచన చేస్తూ నిపుణుల సూచనలతో
పనిచేస్తామని తెలుపుతూ రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పుట్టి.రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.హరి,రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు,
శానిటేషన్ కార్యదర్శుల విభాగం ప్రతినిధులు యస్.కె. హీరామియా,కె.నాగబాబులతో
కూడిన బృందంతో ప్రకటన విడుదల చేశారు.