*పోర్టు నిర్మాణ పనులకు ఈ నెల 22న సీఎం జగన్ శంకుస్థాపన
అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం
మొత్తం రూ.11,464 కోట్ల వ్యయం..116 మిలియన్ టన్నుల సామర్థ్యం
తొలి దశలో రూ.5,156 కోట్ల పెట్టుబడి..నాలుగు బెర్తుల నిర్మాణం
విజయవాడ : మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ కార్యరూపం దాల్చుతోంది. సుమారు
రూ.11,464 కోట్ల భారీ పెట్టుబడితో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం
శ్రీకారం చుడుతోంది. మొత్తం 16 బెర్తులతో 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో
దీన్ని నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.5,156 కోట్లతో నాలుగు
బెర్తుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న
శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో
పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,668.83 కోట్ల విలువైన పనుల
కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్
దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు
కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా
తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి,
పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట
నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. అలాగే వ్యవసాయ
ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము
ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే
ప్రత్యక్షంగా పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
దక్షిణాసియాకు ముఖద్వారంగా : దేశ తూర్పుతీరంలో దక్షిణాసియా దేశాలకు అత్యంత
దగ్గరగా మచిలీపట్నం పోర్టు ఉండటంతో పూర్వకాలంలో మసూలీపటా ఓడరేవు పేరుతో
ఇక్కడి నుంచి పర్షియన్ (గల్ఫ్) దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.
మచిలీపట్నం ప్రాంతపు చేనేత, కలంకారీ, అద్దకం దుస్తులకు పర్షియా దేశాల్లో మంచి
డిమాండ్ ఉండేది. దీంతో ఆంగ్లేయులతోపాటు, డచ్, పోర్చుగీసు వారు మచిలీపట్నంలో
వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. 1970 వరకు కార్యకలాపాలు
కొనసాగించిన బందరు పోర్టు కాలక్రమంలో కనుమరుగైపోయింది.
*అన్ని అనుమతులతో ముందుకు : స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన మచిలీపట్నం
పోర్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008, ఏప్రిల్
23న శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్ అకాల మరణానంతరం నిర్మాణ పనులు
అటకెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర
నుంచి అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో
భాగంగా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు
డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు
చేశారు. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు
చేయడమే కాకుండా నిధులను కూడా సమకూర్చారు. ఆ తర్వాత రూ.3,668.83 కోట్లతో
నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్
లిమిటెడ్‌తో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే
పోర్టు నిర్మాణానికి అవసరమైన కీలకమైన పర్యావరణ అనుమతులు ఫిబ్రవరి 28న
వచ్చాయి. పోర్టును జాతీయరహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ నాలుగులైన్ల రహదారి,
ఏడు కి.మీ రైల్వే లైన్ నిర్మాణాలకు కూడా అనుమతులు సాధించారు. *
తీర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి
ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ అండ్ ఎండీ ఏపీఐఐసీ సీఈవో ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా
పారిశ్రామికంగా, వాణిజ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం వైఎస్
జగన్ దృఢసంకల్పం. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడమే
కాకుండా ఏకకాలంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం
రాష్ట్రంలో ఐదు నాన్ మేజర్ పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్
టన్నులుగా ఉంది. 2022–23లో 175 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగాయి.
2025–26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నులు పెంచాలని
లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో రామాయపట్నం,
మూలపేట, మచిలీపట్నం పోర్టులతో పాటు పీపీపీ విధానంలో కాకినాడ వద్ద గేట్‌వే
పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ నాలుగు పోర్టుల నిర్మాణం ద్వారా
రాష్ట్రంలో అదనంగా 75 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.