ఐదు రోజుల్లోనే పంట నష్టపరిహారం
‘కేచ్ ది రైన్’ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించాలి
డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్ వర్క్ ప్రారంభం విప్లవాత్మకం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : గతంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగినపుడు ప్రభుత్వ
భూమి లేదా ప్రైవేటు భూమి అని నిర్దారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో
చుక్కలు పెట్టి వదిలేశారని అటువంటి భూములను చుక్కల భూముల చిక్కులు తొలగించి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు
ట్విట్టర్ వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. సుమారు 206171 ఎకరాల
భూములకు సంపూర్ణ హక్కులు కల్పించారని వీటి మార్కెట్ విలువ రూ20వేల కోట్లు
ఉంటుందని అన్నారు. ఈ నిర్ణయంతో దశాబ్దాల సుమస్యకు శాశ్వతంగా తెరపడిందని,
97461 మంది రైతులకు కుటుంబాలు లబ్ది పొందాయని అన్నారు.
ఐదు రోజుల్లోనే పంట నష్టపరిహారం : అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సమయంలో పరిహారం అందజేసిందని విజయసాయి
రెడ్డి అన్నారు. కేవలం 5 రోజుల్లోనే పరిహారం అందించి ఇది రైతన్నల ప్రభుత్వమని
మరోమారు నిరూపించబడిందని అన్నారు.
‘కేచ్ ది రైన్’ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించాలి : నీటి కొరతను
అధిగమించేందుకు, రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సేకరణ
చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాలని విజయసాయి రెడ్డి అన్నారు. రానున్న జూన్ నుంచి
వర్షాకాలం కావడంతో వర్షపు నీరు వృధా కానీయకుండా నీటిని నిల్వ చేసే అన్ని రకాల
చర్యలు చేపట్టాలని కోరారు. కేచ్ ది రైన్ ప్రచారం గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ
పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు.
డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్ వర్క్ ప్రారంభం విప్లవాత్మకం : ప్రధాని నరేంద్ర
మోడీ ప్రారంభించిన డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్ వర్క్ విప్లవాత్మకమని విజయసాయి
రెడ్డి అన్నారు. ఓఎన్ డీసీతో దిగ్గజ ఈ కామర్స్ ల ఏకచక్రాదిపత్యానికి కళ్లెం
పడుతుందని, చిన్న చిన్న వర్తకులు దర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా తమ వాణిజ్య
కార్యకలాపాలు స్వేచ్చగా కొనసాగించు కోవచ్చని ఆయన అన్నారు.