విజయవాడ : సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యం లో ఆన్ లైన్ అవగాహన తరగతులు
నిర్వహణ లో భాగంగా శనివారం వాసిరెడ్డి అమరనాధ్ ఉదయం 8 గంటల నుంచి 9 వరకు,
ఉదయం 9 నుంచి 10 గంటలవరకు సీనియర్ జర్నలిస్టు జి. వల్లీశ్వర్ లు
ప్రసంగిస్తారని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటన లో
తెలిపారు. సి.ఆర్. మీడియా అకాడమి ఆధ్వర్యం లో నిర్వహించబడుతోన్న జర్నలిజం లో
డిప్లొమా కోర్సు విద్యార్థులకు, ఇతర వర్కింగ్ జర్నలిస్టులకు ఆన్ లైన్ లో
అవగాహన తరగతులు సి.ఆర్. మీడియా అకాడెమి ప్రతి శనివారం నిర్వహిస్తున్న సంగతి
తెల్సిందే. అదే క్రమం లో ఈ శనివారం కూడా ప్రముఖులచే అవగాహనా తరగతులు
నిర్వహిస్తున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావు తెలిపారు. ప్రముఖ విశ్లేషకుడు,
విద్యావేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు వాసిరెడ్డి అమర్ నాథ్ “మాధ్యమాలు-
విశ్వసనీయత” అంశం పై ప్రత్యేక ప్రసంగం చేస్తారని, అదే విధంగా “జర్నలిజం –
నైతికత” అనే అంశం పై జి. వల్లీశ్వర్ ప్రత్యేక ఉపన్యాసం ఇస్తారని ఛైర్మన్ ఆ
ప్రకటన లో తెలిపారు.
జి. వల్లీశ్వర్ ఆంధ్ర పత్రిక’ విలేకరిగా కెరీర్ ప్రారంభించి బ్యూరో చీఫ్
స్థాయికి ఎదిగారు. తొమ్మిది లోక్ సభ ఎన్నికలను, ఏడు శాసనసభ ఎన్నికలను, రాజ్యసభ
కార్యకలాపాలను రిపోర్ట్ చేసిన అనుభవం వారి స్వంతం. ముఖ్యమంత్రులు వై ఎస్
రాజశేఖర రెడ్డి, రోశయ్య కి మీడియా సలహాదారుగా పనిచేశారు. రచయితగా, అనువాద
రచయితగా పలు పుస్తకాలను ఆయన రచించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ
జర్నలిస్టుగా అవార్డు, ఏలూరు ప్రెస్ ఫోరం నుండి ‘గోల్డెన్ పెన్’అవార్డు లను
ఆయన పొందారు. ప్రస్తుతం – ‘ఎమెస్కో ‘ పుస్తక ప్రచురణ సంస్థలో ‘విషయ సమన్వయ
కర్త ‘గా రచనా వ్యాసంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. సివిల్ సర్వీసెస్
అభ్యర్థులకు పలు సబ్జెక్టు లలో శిక్షణ ఇచ్చిన అనుభవం తో పాటు హైదరాబాద్,
విజయవాడ లలో స్కూళ్లను నిర్వహిస్తూ విద్యా రంగానికి ఎనలేని కృషి చేస్తోన్న
వ్యక్తిత్వం వాసిరెడ్డి అమర్ నాథ్ స్వంతం. వ్యక్తిత్వ వికాస నిపుణులైన వీరు ఆ
అంశం పై పలు ప్రసంగాలు శిక్షణ ను ఇచ్చారు. ఈ ఇరువురు ప్రముఖుల ప్రత్యేక
ఉపన్యాసాలను వర్కింగ్ జర్నలిస్టులు, జర్నలిజం లో డిప్లొమా కోర్సు చేస్తోన్న
అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సి.ఆర్. మీడియా అకాడెమి చైర్మన్
కొమ్మినేని శ్రీనివాస రావు ఆ ప్రకటన లో కోరారు.