సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను
డిసెంబరులో ఎన్నికలు రావొచ్చు
జులై నుంచి ఇక్కడే ఉంటా
త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదు
జనసేన ఉన్నది టీడీపీ నేతను సీఎం చేయడానికి కాదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్
గుంటూరు : త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదని పవన్
కల్యాణ్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా జనసేన, టీడీపీ , బీజేపీ పొత్తు ఉంటుందని
స్పష్టం చేశారు. డిసెంబరులో ఎన్నికలు పెట్టే అవకాశముందని, జులై నుంచి ఇక్కడే
ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ
కార్యాలయంలో శుక్రవారం జరిగిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన
మాట్లాడారు. ‘‘సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో
గజమాలలు వేసే కన్నా ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలి.
ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే నా అంత బలంగా తిరగాలి. ఒక్కొక్కరు వంద
ఓట్లు వేయించగలిగే సత్తా ఉండాలి. ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలి. సీఎం అనే
పదవి రావాలంటే సముచిత స్థానంలో గెలిపించాలి. నేను మానవతా వాదిని.
దేశభక్తుడిని. ఏటా కార్యకర్తల ఆరోగ్యం కోసం రూ.కోటి ఖర్చు చేస్తున్నా. నేను
సర్వస్వాన్ని వదిలి మీకోసం వచ్చా. 2014లో మద్దతిచ్చాం..తప్పులు ఎండగట్టాం’’
అని పవన్ వివరించారు.
త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదు : త్రిముఖ పోటీలో
బలికావడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం
చేశారు.‘‘ఫ్యూడలిస్టిక్ సిద్ధాంతాలతో రాష్ట్రాన్ని వైసీపీ నలిపేస్తోంది.
వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అని గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ను
అధోగతి పాల్జేసింది, రాష్ట్రంలో గూండాయిజాన్ని పెంచి పోషించింది, రైతులు,
నిరుద్యోగులను మోసం చేసింది వైకాపానే. ఇంత మోసం చేసిన ఆ పార్టీని ప్రత్యర్థిగా
భావించాలా? టీడీపీనా? హెలికాప్టర్ వెళ్తుంటే పచ్చని చెట్లు కొట్టేస్తారా?
ప్రజల్లో పచ్చదనాన్ని చంపేస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వైకాపాను
గద్దె దించేయాల్సిందే. అనుకూల ప్రతికూల పరిస్థితులను తట్టుకున్న వారే
నాయకులు. తెదేపా నాయకులను సీఎం చేసేందుకు జనసేన లేదు. మనకు ఎంత బలం ఉందో
బేరీజు వేసుకోవాలి. 134 స్థానాల్లో పోటీ చేస్తే.. కనీసం 40 గెలిచినా సీఎం
అయ్యేవాళ్లం. రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే ఉంటాయి, భేషజాలు ఉండవు. వ్యూహాలు
నాకు వదిలి బాధ్యతలు మీరు తీసుకోండి. జూన్ నుంచి కార్యాచరణ రూపొందించి
ముందుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన, టీడీపీ , బీజేపీ పొత్తు
ఉంటుంది. ఏం చేసినా చెప్పి చేస్తా. మొదటి అడుగు వైసీపీని గద్దె దించడమే.
పొత్తు ఖచ్చితమనేది ప్రకటించా. ఇంకా ఆ స్థాయిలో చర్చలు జరగలేదు. విధివిధానాలు
ఇంకా ప్రకటించలేదు. పొత్తుపై కొలిక్కి వచ్చాక ప్రజల మధ్య ఒప్పందం చేసుకుంటాం.
మేం ఏం చేస్తామో ప్రకటించి పొత్తు పెట్టుకుంటాం. నాయకులు కావాలంటే వ్యూహమే
కావాలి. వ్యూహం నేను అమలు చేస్తా. ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి. నేను ఏ వ్యూహం
వేసినా రాష్ట్ర హితం నాకు ముఖ్యం. అడ్డగోలుగా సంపాదించి మనల్ని బెదిరిస్తారా?
ఇంకోసారి ఇలాంటి వ్యక్తి సీఎం అయితే ఏపీ కోలుకోలేదు. ఇప్పుడు కావాల్సింది ఎవరు
సీఎం అనేది కాదు. ఇప్పుడున్న సీఎంను తీసేయడం మొదటి ఆలోచన. ఎవరు సీఎం అనేది
ఆరోజు బలాబలాలను చూసి నిర్ణయించుకోవాలి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం
ముఖ్యమైంది. పొత్తు ప్రభుత్వాన్ని గద్దెను ఎక్కించడం ముఖ్యం’’ అని పవన్
కల్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం
ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
‘‘జనసేనలో నేనూ ఒక కార్యకర్తను. నేను మార్పును కోరుకునేవాడిని. డబ్బు లేకుండా
రాజకీయాలు చేయవచ్చని చూపించాం. ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలి. అసలు డబ్బు
ఖర్చు పెట్టకుండా రాజకీయాలు కుదరదు. మాకు జనాదరణ ఉంది. జనాదరణ ఉన్నా 10
స్థానాలు కూడా రాకుంటే ఏం చేయలేం. కష్టాల్లో పవన్ గుర్తుకొస్తాడు.
ఎన్నికలప్పుడు మర్చిపోతారు. జనసేన ఉన్నది టీడీపీ నేతను సీఎం చేయడానికి కాదు.
ఎంఐఎం పార్టీ 7 స్థానాలకే పరిమితమైనా దాని ప్రాధాన్యత అలాగే ఉంది. మన బలం
ఏమిటో మనం బేరీజు వేసుకోవాలి. క్రేన్లతో గజమాలలు వేయడం కాదు.. ఓట్లు వేయండి.
పొత్తులను తక్కువగా అంచనా వేయవద్దు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
ఖచ్చితంగా పొత్తులు ఉంటాయి : తాను నటించిన బీమ్లానాయక్ సినిమాను
అడ్డుకున్నారని సినిమాను అడ్డుకోవడంతో రూ.30 కోట్లు నష్టం వచ్చిందని పవన్
తెలిపారు. తప్పు చేస్తే కచ్చితంగా నిలదీస్తాం, తాటతీస్తామని హెచ్చరించారు.
గుండె దమ్ము లేనివారు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. 40 ఏళ్లు పార్టీ నడిపిన,
సీఎంగా చేసిన వ్యక్తి గురించే నీచంగా మాట్లాడారని విమర్శించారు. త్రిముఖ
పోటీలో బలి కావడానికి జనసేన సిద్ధంగా లేదన్నారు. ఏపీలో కచ్చితంగా పొత్తులు
ఉంటాయని, సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూన్
నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధంగా ఉన్నామని పవన్ ప్రకటించారు.