సిద్దేశ్వరం అలుగు సాధనకై మే 31 న 16 గంటల జలజాగరణ దీక్ష
దీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల : చారిత్రాత్మిక, ఆధ్యాత్మిక, సాహిత్య, రాజకీయ రంగాలలో రాయలసీమ అత్యంత
ప్రాధాన్యత కలిగి ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా
దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన
సమితి కార్యాలయంలో మే 31 న జరిగే సిద్దేశ్వరం అలుగు ఏడవ వార్షికోత్సవ
సందర్భంగా జరిగే జలజాగరణ దీక్షపై బహిరంగ ప్రకటనను ఆయన విడుదల చేశారు. ఈ
సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి కావలసిన అనేక వనరులు; అటవీ
సంపద, భూగర్భ సంపద, అన్ని పంటలు పండే సారవంతమైన నేలలు, వాతావరణం, అన్ని రకాల
పంటలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అవసరమైన విత్తనాలను ఉత్పత్తి
చేయగలిగిన మానవ వనరులు రాయలసీమలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో వర్షపాతం
కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా, వాటి ఉపనదులైన తుంగభద్ర, వేదవతి,
హంద్రీ నదులు మరియు పెన్నా, దాని ఉపనదులైన చిత్రావతి, బహుద, కుందూ తదితర నదుల
పరవల్లతో ఈ ప్రాంతం పునీతం అవుతూనే ఉందని ఆయన అన్నారు.
అనేక మంది ముఖ్య మంత్రులకు, ప్రతిపక్ష పార్టీల అధినాయకులకు రాయలసీమే
జన్మస్థలం అని ఆయన గుర్తు చేశారు. ఇదంతా వింటుంటే ఒళ్లంతా పులకరించడమే గాక, ఈ
పుణ్యభూమిలో పుట్టడం ఎంత అదృష్టమో కదా అన్న భావన కలుగుతుందని ఆయన తెలిపారు.
అన్ని అనుకూలమైన అంశాలే ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన
పాలక, ప్రతిపక్ష పార్టీల నిర్లిప్తతతో రాయలసీమ నిత్యం కరువు, వలసలతో
కొట్టుమిట్టాడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు రాజకీయ, సామాజిక
వ్యవస్థలు, రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను తమ అజెండాలో చేర్చుకొని
పోరాటాలు చేపట్టడంలో అచేతనంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. మరొక వైపు కొన్ని
శక్తులు రాయలసీమలో నీరు లేదు, నీటి హక్కులు లేవు, ఎలా బతుకుతుందో అని మొసలి
కన్నీరు కారుస్తూనే రాయలసీమ సమాజాన్ని నైరాస్యానికి గురి చేసే భావజాలాన్ని
విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో రాయలసీమలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన “సిద్దేశ్వరం అలుగు ప్రజా
శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం” పురస్కరించుకుని “సిద్దేశ్వరం జల జాగారణ దీక్ష”
కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడమైనదని ఆయన అన్నారు. రాయలసీమ సమాజాన్ని
మానసికంగా బలహీన పరిచి, సమాజాన్ని అచేతనం చేయతలపెట్టిన కుటిల శక్తుల, కపట
చేష్టలను అర్థం చేసుకొని, దాన్ని పటాపంచలు చేస్తూ, రాయలసీమ హక్కుల భావజాలాన్ని
విస్తృత పరిచి, పాలకులపై ఒత్తిడి తీసుకొని వచ్చి రాయలసీమ అభివృద్ధికి బాటలు
వేసే లక్ష్యం తో “సిద్దేశ్వరం జల జాగారణ దీక్ష” నిర్వహిస్తున్నామనీ,
జాగారణతో “రాయలసీమ సమాజంలోని అనంతమైన శక్తిని జాగృతం” చేసే దిశగా అడుగులు
వేద్దామని ఆయన ప్రజలను కోరారు. రాయలసీమ సమాజలోనికి కొన్ని శక్తులు
జొప్పిస్తున్న విష భావజాలాన్ని ఎండగట్టే దిశగా మరియు రాయలసీమ వనరులు, హక్కులపై
అవగాహన కలుగ చేసే దిశగా జాగారణ దీక్ష సన్నాహక కార్యక్రమాలు మే 1, 2023 నుండి
చేపట్టడమైనది ఆయన తెలిపారు. మే 31, 2023 సాయింత్రం 6 గంటల నుండి జూన్ 1, 2023
ఉదయం 10 గంటల వరకు నిర్వహించే “సిద్దేశ్వరం జల జాగారణ దీక్ష” లో పెద్ద
ఎత్తున పాల్గొందాం, మన లక్ష్యాన్ని సాధించుకుందామని రాయలసీమ ప్రజలకు
దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.