శ్రీలక్ష్మి మహాయజ్ఞం ప్రారంభించనున్న సీఎం జగన్
విజయవాడ : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నుంచి 17వ
తేదీ వరకు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత
శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి
వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ,
అజస్రదీపారాధనతో కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్
శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తారు. మొత్తం ఆరు రోజుల పాటు ఈ యాగ
కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యా గాన్ని 108 కుండాలు, నాలుగు ఆగమనాలు, 500 మంది
రుత్వికులతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని,
ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం
చేపట్టినట్టు దేవదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. ఏర్పాట్లను
పరిశీలించడానికి వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం ఈ అంశాలతో పాటు జగన్
మరోసారి సీఎం కావాలని యాగం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ యాగం ప్రచార
ఖర్చులను దేవదాయ శాఖ దేవాలయాలపై వేయడం విస్మయం కలిగిస్తోంది. ప్రధాన
దేవాలయాలు, ఉపకమిషనర్ కేడర్ దేవాలయాలు, సహాయ కమిషనర్ దేవాలయాలు ప్రచార
సామగ్రిని ముద్రించుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆర్జేసీ, ఉపకమిషనర్
కేడర్ దేవాలయాలు 5 వేల కరపత్రాలు, 2 వేల వాల్పోస్టర్లు, పది పెద్ద
హోర్డింగ్లు, 50 ఫ్లెక్సీలు, 50 బ్యానర్లు ముద్రించాలని ఉత్తర్వుల్లో స్పష్టం
చేశారు. ఇక సహాయ కమిషనర్, గ్రేడ్ 1, 2, 3 దేవాలయాలు 2 వేల కరపత్రాలు, 1000
వాల్పోస్టర్లు, ఐదు పెద్ద హోర్డింగ్లు, 20 ఫ్లెక్సీలు, 25 బ్యానర్లను
ముద్రించాలని పేర్కొన్నారు. వాటిని దేవాలయాల ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, ముఖ్య
కూడళ్లలో భక్తులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రచార సామగ్రి
ముద్రణకు టెండర్లను ఆహ్వానించి ఆమోదిత రేట్ల ప్రకారం ఖరారు చేయాలని
ఆదేశించారు. అసలు జగన్ కోసం చేసే యాగానికి దేవాలయాల నిధుల నుంచి ప్రచార
సామగ్రిని ముద్రించడం ఏమిటని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ యాగానికి
మొత్తం రూ.10 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు దేవదాయ శాఖ తెలిపింది.