మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పశ్చిమ గోదావరి జిల్లా : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన
తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై మంత్రి కాకాణి విమర్శనాస్త్రాలు సంధించారు.
రైతులు పది పంటలను చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేని వారూ పర్యటనలు,
పరామర్శలు చేసినంతా మాత్రాన రైతులు ఓట్లు వేయరంటూ ఎద్దేవా చేశారు.
తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్
రెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, ధాన్యం సేకరణ
విధానాన్ని పౌరసరఫరాల శాఖామంత్రి కారుమూరి నాగేశ్వరరావు , ఉప ముఖ్యమంత్రి
కొట్టు సత్యనారాయణ, అగ్రిటెక్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, స్థానిక నాయకులు,
అధికారులు, రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్,
ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. అకాల
వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని
మంత్రి కాకాణి వెల్లడించారు.
నష్టపోయిన రైతాంగానికి ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి
కాకాణి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ తీరు పట్ల రైతులు
సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అకాల వర్షాల వల్ల
నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలవాలని, రైతుల నష్టపరిహారం అంచనాలలో
గానీ, చెల్లింపులలో గానీ, ధాన్యం సేకరణలో గానీ ఉదాసిన వైఖరి అవలంబించకుండా,
అన్ని విధాల రైతాంగానికి అండగా నిలవాలని ఆదేశించినట్లు మంత్రి కాకాణి
తెలిపారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, రైతులకు సహాయ
సహకారాలు అందించేందుకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి కాకాణి తెలిపారు. అకాల
వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని, ధాన్యం కొనుగోళ్లను క్షేత్రస్థాయిలో
పరిశీలించడానికి పర్యటిస్తున్నామని మంత్రి కాకాణి పేర్కొన్నారు.