మల్టీ ఫార్మింగ్ లో పరిశోధనలు ప్రోత్సహించాలి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చకచకా
ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలను
వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.
ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు అందించనున్నారని, దీనికి సంబంధించి
లేఅవుట్ల ఏర్పాట్లు పూర్తవుతున్నాయని అన్నారు. ప్లాట్లను గుర్తించేందుకు
సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 15 తరువాత సీఎం జగన్
చేతుల మీదుగా లబ్దిదారులకు పట్టాలు అందించనున్నారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి నుంచి వలంటీర్ వరకు అంతా ప్రజా సేవకులే : ముఖ్యమంత్రిగా తానున్నది
అధికారం చలాయించడానికి కాదని, తనతో సహా వలంటీర్ల వరకు అంతా ప్రజా సేవలకులమేనని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో
ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలనే తపనతో అందరం కలిసికట్టుగా పని
చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారని అన్నారు.
మల్టీ ఫార్మింగ్ లో పరిశోధనలు ప్రోత్సహించాలి : చిన్న, మధ్య తరగతి రైతులకు
బహుళ వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని, ఈ మేరకు బహుళ వ్యవసాయంలో పరిశోధనలు పెద్ద
ఎత్తున ప్రోత్సహించాలని విజయసాయి రెడ్డి అన్నారు. మల్టీ ఫార్మింగ్ లాభసాటి
వ్యవసాయం అని నిరూపణ అయినప్పటికీ చాలామంది రైతులకు అవగాహన లేకపోవడంతో బహుళ
వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని ఆయన అన్నారు.