17న ఢిల్లీలో అవార్డులు అందుకున్న ఇద్దరు డ్రైవర్లు
ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యమన్న ఎం.డి సి హెచ్. ద్వారకా తిరుమల రావు
విజయవాడ : దేశంలోనే ఉత్తమ డ్రైవర్లుగా “హీరోస్ ఆన్ రోడ్” పేరుతో 2
కేటగిరీలలో (సిటీ మోఫిస్సిల్ ) అవార్డులు గెలుచుకున్న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.
డ్రైవర్లను, సంస్థ ఎం.డి సి హెచ్. ద్వారకా తిరుమలరావు బుధవారం ఆర్టీసీ హౌస్
లో అభినందించి సన్మానించారు. సిటీ కేటగిరీలో ఆత్మకూరు (కర్నూలు) డిపోకి చెందిన
డ్రైవరు ఏ.ఎం. బాషా (36 సంవత్సరాల 6 నెలల సర్వీసు), మోఫిస్సిల్ కేటగిరీలో
సింహాచలం డిపోకి చెందిన డ్రైవరు ఎస్.ఏ.ఎన్.రాజు (33 సంవత్సరాల 10 నెలల
సర్వీసు) అనే ఇద్దరు డ్రైవర్లు తమ మొత్తం సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా
చేయకుండా విధులు నిర్వర్తించినందుకు జాతీయ స్థాయిలో ఈ అవార్డులు అందుకుని
ఆర్.టి.సి కి పేరు తీసుకొచ్చారు. ఆర్టీసీ హౌస్ లో ప్రతి నెలా జరిగే అన్ని
జోన్ల అధికారుల సమీక్షా సమావేశంలో సంబంధిత జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
గోపీనాథ్ రెడ్డి, సి హెచ్. రవికుమార్ ల సమక్షంలో ఆ ఇద్దరి డ్రైవర్లను సంస్థ
ఎం.డి సి హెచ్. ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు
అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. నిత్యం
ప్రయాణీకుల క్షేమం కోసం సురక్షితమైన డ్రైవింగ్ చేసే డ్రైవర్లు నిజంగా హీరోలని
ఎం. డి. ప్రశంసించారు.
ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్య స్థానాలకు చేర్చడం ఆర్టీసీ ప్రధమ
కర్తవ్యమని, సర్వీసులో ఒక్క ప్రమాదానికీ తావివ్వకుండా ఆ బాధ్యతని సమర్ధవంతంగా
నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సంస్థ పేరును నలువైపులా
ఇనుమడింపజేశారని, మిగతా డ్రైవర్లు అందరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకుని డ్యూటీలు
చేయాలన్నారు. 30 సంవత్సరాలకు పైగా యాక్సిడెంట్లు చేయకుండా ఉద్యోగం చేయడం
అభినందనీయమన్నారు. డ్రైవర్లు ఏకాగ్రతతో డ్యూటీ చేసి ప్రమాదాల సంఖ్య
తగ్గించాలని సూచించారు. డ్రైవర్లు ఏ విధమైన చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తమ
ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) కే. ఎస్. బ్రహ్మానంద రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) ఏ. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
(ఇంజినీరింగ్) పి. కృష్ణ మోహన్, ఓ.ఎస్.డి.(సి & ఎల్ ) జి.వి.రవి వర్మ,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్ III) ఆదం సాహెబ్, ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్(జోన్ II), గిడుగు వెంకటేశ్వర రావు, సి.టి.ఎం. జి. నాగేంద్ర
ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.