ఆదుకుంటామని, పంట కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.
రాజాబాబు రైతులకు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, రాష్ట్ర గృహ
నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ లక్ష్మీ
షా, పామర్రు శాసన సభ్యులు కైలే అనీల్ కుమార్ తోట్లవల్లూరు మండలంలోని
వల్లూరుపాలెం, బద్రిరాజుపాలెం గ్రామాలలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాలకు
దెబ్బతిన్న మొక్కజొన్న, పసుపు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, పసుపు పంటకు ఎక్కువ
మొత్తంలో నష్టం వాటిల్లిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రతి సమస్యను
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. నాణ్యమైన పంటతో
పాటు దెబ్బతిన్న పంట కొనుగోలుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే మొక్కజొన్న పంట నిమిత్తం కొనుగోలు
కేంద్రాలను ఏర్పాటు చేశామని, త్వరలో పసుపు పంటను సైతం రైతు భరోసా కేంద్రాల
ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ లక్ష్మీ
షా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ పంట నష్ట వివరాలను
పరిశీలిస్తున్నామని, ఇందులో పసుపు, మొక్కజొన్న అటు పంట కోయకుండా ఉన్న పంటతో
పాటు నూర్పిళ్లు చేపట్టిన పంటకు కూడా నష్టం జరిగినట్లు తమ పరిశీలనలో
గమనించినట్లుగా పేర్కొన్నారు. పొలాల్లో నిలబడి నష్టం జరిగిన పంటకు ఇప్పటికే
ఎన్యుమరేషన్ చేయడం జరిగిందని, వర్షాలకు ముందుగా నూర్పిళ్లు చేపట్టి నష్టపోయిన
పంటకు ఎన్యుమారేషన్ చేసిన తర్వాత నిపుణలతో చర్చించి తగిన చర్యలు
తీసుకుంటామన్నారు. నష్టపోయిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించి అండగా ఉంటామని
హామీ ఇచ్చారు.
పామర్రు శాసన సభ్యులు కైలే అనీల్ కుమార్ మాట్లాడుతూ ఈ మే నెలలో కురిసిన అకాల
వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించడం ఎంతో దురదృష్టకరమన్నారు. జగన్
ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులు ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా ఇప్పటికే
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పసుపు,
మొక్కజొన్న పంటల నష్టంపై అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా చర్యలు
తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయ భారతి, ఉద్యాన
శాఖ ఏడీ జ్యోతి, మార్క్ ఫెడ్ ఏడీ పి.మురళీ కిషోర్, తోట్లవల్లూరు ఎంపిడిఓ
సువర్ణలత, తహసీల్దారు కట్టా వెంకటశివయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు
తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.