మచిలీపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లాలో ఈనెల 19వ
తేదీ గుడివాడ , 22వ తేదీ మచిలీపట్నంలో జరిపే రెండు ముఖ్యమైన కార్యక్రమాలను
వివి ధ శాఖల అధికారులు ఒక జట్టుగా ఏర్పడి, సమన్వయంతో విజయవంతం చేయాలని
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ, కృష్ణాజిల్లా ఇన్చార్జ్
మంత్రి ఆర్కే రోజా సూచించారు. ఆదివారం ఆమె మచిలీపట్నంలోని రోడ్లు భవనాల శాఖ
అతిథి గృహంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మచిలీపట్నం
శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ
వెంకటేశ్వరరావు (నాని), శాసనమండలి సభ్యుడు తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ పి.
రాజాబాబు, ఎస్పీ పి. జాషువా, డి ఆర్ ఓ, ఆర్ డి ఓ, పోర్టు అధికారులు తదితరులతో
సమావేశమయ్యారు.అనంతరం ఆమె నేరుగా మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ స్థలం, హెలిపాడ్ ,
పైలాన్ లను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ స్థలాలను
ఎంపీక చేసేందుకు నోబుల్ కళాశాల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లను ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్
సమావేశ మందిరంలో ఆయా కార్యక్రమ నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన సమీక్షా
సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, మచిలీపట్నం పోర్టు యావత్
కృష్ణాజిల్లా ప్రజల చిరకాల వాంఛ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 22వ
తేదీన నెరవేర్చుతున్నారన్నారు. మచిలీపట్నం పోర్టు పనులకు భూమి పూజ చేయడం ఒక
చారిత్రాత్మకమైన మధుర ఘట్టం అని మంత్రి రోజా అభివర్ణించారు. దాదాపు 5 వేల
కోట్లతో 17 వందల ఎకరాల్లో మొదటి దశ పోర్టు నిర్మాణ పనులు ఆరోజు నుంచే మొదలు
కాబోతున్నాయి అన్నారు. ముఖ్యమంత్రిగా నాలుగు సంవత్సరాల పాలనా కాలంలో నాలుగు
పోర్టులను అభివృద్ధి చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ పోర్టులు
పూర్తయితే, ప్రత్యక్షంగా, పరోక్షంగా 20,000 మంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి
అవకాశాలు లభిస్తాయిన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో విజన్ ఉన్న
నాయకుడే కాక సక్సెస్ ఫుల్ బిజినెస్ మేనేజ్మెంట్ తెలిసిన విక్టరీ సీఎం అని
మంత్రి రోజా కొనియాడారు. ఆయన హయాంలో వివిధ పరిశ్రమలు రాష్ట్రానికి పెద్ద
ఎత్తున వచ్చాయన్నారు. వాటిని ఏ విధంగా మరింతగా అభివృద్ధి పరిచి ఉద్యోగ
అవకాశాలు మెరుగుపరిచి యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కష్టించి
ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. గుడివాడలో ఈనెల 19వ తేదీన 800 కోట్ల
రూపాయలతో దాదాపు 9 వేల టిడ్కో ఇళ్లను నిర్మించి ఆధునాతన వసతులు, మౌలిక
సదుపాయాలతో కూడిన ఇళ్లను పేదలకు ముఖ్యమంత్రి 19వ తేదీన అందజేయనున్నారని మంత్రి
రోజా తెలిపారు.
అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, కొద్ది నెలల
క్రితం ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో కృష్ణా జిల్లాలో పెడన, అవినిగడ్డ
నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేశామన్నారు. బందరు పోర్టు ఒక
చారిత్రాత్మకవసరమని గుర్తించి ప్రజాభిష్టాన్ని నెరవేర్చేందుకు మే నెల 22వ
తేదీన మచిలీపట్నం వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం అందరం
పలుకుదామన్నారు. కృష్ణాజిల్లా అభివృద్ధికి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం ఎంతో
కీలకమన్నారు, అలాగే ఈనెల 19వ తేదీన గుడివాడ నియోజకవర్గంలో తొమ్మిది వేలకు పైగా
టిడ్కో ఇళ్లను పేద మధ్యతరగతి ప్రజలకు ఒక సొంత ఆస్తి మాదిరిగా అందిస్తున్న
ముఖ్యమంత్రి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని మంత్రి జోగి రమేష్ అన్నారు.
తర్వాత కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వివిధ శాఖల అధికారులతో
మాట్లాడుతూ, ఈనెల 22వ తేదీన మచిలీపట్నంలో జరిగే పోర్టు నిర్మాణ పనులకు భూమి
పూజ చేసిన ముఖ్యమంత్రి అనంతరం మచిలీపట్నంలో జరిగి బహిరంగ సభలో పాల్గొంటారని
చెప్పారు. ఆ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నోబుల్ కళాశాల, పోలీస్
గ్రౌండ్ స్థలాలను పరిశీలించామన్నారు. అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సభ
నిర్వహించేందుకు అనుకూలంగా ఉండడంతో ఆ గ్రౌండ్ ను ఎంపిక చేసామన్నారు. మే 22వ
తేదీన జరిగే మచిలీపట్నం పోర్టు నిర్మాణం పనులకు భూమిపూజ కార్యక్రమం, అనంతరం
జరిగే బహిరంగ సభ తదితర అంశాలకు సంబంధించి ఏ అధికారి ఏ పనులు నిర్వహించాలనే
విషయంపై మరోమారు వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతామన్నారు. సీఎం పాల్గొనే
కార్యక్రమాలకు ప్రజలు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరవుతారని, ఏ ఒక్కరికి
ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులు బాధ్యతతో తమకు కేటాయించిన పనుల్లో
నిమగ్నమవ్వాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ
మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత థామస్ నోబుల్, మాజీ మున్సిపల్ చైర్మన్
షేక్ సలార్ దాదా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ.
కిషోర్, మచిలీపట్నం తహసిల్దార్ సునీల్ బాబు, మచిలీపట్నం పోర్టు ఎండి
విద్యాశంకర్, మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ హెడ్ తులసీదాస్, డ్వామా పిడి జీవి
సూర్యనారాయణ, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, పలువురు
కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.