విజయవాడ : వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా
ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది.
అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు. ఈ పుణ్య
తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నాను.
కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారు.
దాస్యశృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన శ్రీ
సీతారామరాజు, ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారు.
శ్రీ సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు
చెరగులకూ విదితమేనన్నారు.
భారతరత్న ప్రకటించాలి : నేటి తరం దేశవాసులందరికీ శ్రీ అల్లూరి సీతారామరాజు
సంకల్పం..పోరాట పటిమ..ధీరత్వం..మృత్యువుకు వెరవని ధైర్యం.. జ్ఞాన-ఆధ్యాత్మిక
సంపదల గురించి తెలియాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. భారత
రత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలి. ఆయన జయంతిని రాష్ట్ర
ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఆయన స్ఫూర్తిని దేశమంతటికీ
చాటాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని, ఆ
చైతన్యమూర్తి వర్ధంతి సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా
పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.