ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లమెంటరీ పరీక్షలు
నిర్వహిస్తాం
సప్లమెంటరీ పరీక్షలకు మే 7 నుండి ఫీజుల చెల్లింపు ప్రారంభం
ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకండి..విద్యా సంవత్సరం వృధా కాకుండా
పరీక్షలు నిర్వహిస్తాం
80.80 శాతం మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు
మార్కుల జాబితా 4 రోజుల తర్వాత అధికార వెబ్ సైట్ www.bse.ap.gov.in లో
అందుబాటులో ఉంచబడతాయి
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ : రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 87.47% ఉత్తీర్ణత సాధించి
పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర
విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ గేట్ వే వివంత హోటల్
లో శనివారం ఎస్ ఎస్ సి పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల
చేసారు. ఈ సందర్భంగా మంత్రి సత్య నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 6,05,052 మంది
పరీక్షకు హాజరు కాగా 4,37,196 మంది (72.26%) విద్యార్థులు ఉత్తీర్ణత
సాధించారని మంత్రి అన్నారు. వారిలో 69.27% బాలురు ఉత్తీర్ణులు కాగా 75.38%
బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలురు కంటే బాలికలు 6.11 ఎక్కువ శాతంలో
ఉత్తీర్ణులై పై చేయిగా నిలిచారు. 933 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించామని,
ఏపి రెసిడెన్సియల్ పాఠశాలల్లో 95.25 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత
సాధించామన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను ప్రభుత్వ పరీక్షల
సంచాలకుల కార్యాలయ వెబ్ సైట్ www.bse.ap.gov.in నందు పొందగలరని దీనికి
సంబంధించి పాస్ వోర్డ్ CBSE@2025 అని తెలిపారు. 38 పాఠశాలల్లో జీరో శాతం
ఫలితాలు వచ్చాయని పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు పాఠశాల వారీగా
సబ్జెక్టు వారీగా విశ్లేషిస్తున్నామని వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం
కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా కృషి
చేస్తామని మంత్రి తెలిపారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు
నిర్వహించామని, జవాబు పత్రాల మూల్యాంకనం కోసం (స్పాట్ వాల్యుయేషన్) 23
క్యాంపులలో 19-04-2023 నుండి 26-04-2023 వరకు నిర్వహించి అనంతరం నేడు ఫలితాలు
ప్రకటించామన్నారు. 26 జిల్లాల్లోనూ మొత్తం 30 వేలమంది స్పాట్ వాల్యుయేషన్ లో
పాల్గొన్నారన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో స్పాట్
వాల్యుయేషన్ లో ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన వసతులు ఏర్పాటు
చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే సూచించారని మంత్రి తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లమెంటరీ పరీక్షలు
నిర్వహిస్తామని వివరణాత్మకంగా టైం టేబుల్ త్వరలో ప్రకటిస్తామని మంత్రి
అన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులుకు నిర్ణీత సమయంలో ఎస్ ఎస్ సి సర్టిఫికట్ లు
సంబంధింత పాఠశాలలకు పంపబడతాయని మంత్రి అన్నారు. రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్
కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 13వ తేదీ లోగా సీ ఎఫ్ ఎం ఎస్ సిటిజెన్
చలానా (www.cfms.ap.gov.in) ద్వారా ప్రతీ సబ్జెక్టుకు రూ. 1000 లు చెల్లించి
రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ సౌకర్యం పొందవచ్చునన్నారు. జగనన్న ప్రభుత్వం
తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చి ఇంగ్లిష్ మీడియం సబ్జెక్టు గా 80.80% మంది
ఉత్తీర్ణత సాధించారని మంత్రి చెప్పారు. 26 జిల్లాల్లో పరీక్షా ఫలితాలను
పరిశీలిస్తే 87.47% ఉత్తీర్ణతా శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో
ప్రథమస్థానంలో నిలవగా 60.39% ఉత్తీర్ణతా శాతంతో నంద్యాల జిల్లా చివరి
స్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య
పడకుండా దీనిని ఒక సవాల్ గా తీసుకుని సప్లమెంటరీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత
సాధించాలన్నారు. పిల్లలు అధైర్య పడకుండా తల్లితండ్రులు వారిని
ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఫెయిల్ అయిన విద్యార్థులు కొరకు
సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక క్లాస్ లు నిర్వహించి సప్లమెంటరీ పరీక్షకు
హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
సప్లమెంటరీ పరీక్షలు కొరకు హాజరయ్యే విద్యార్థులు మే 7 నుండి 17వ తేదీ వరకూ
ఫీజులు చెల్లించవచ్చునని, 50 రూపాయల అపరాధ రుసుము తో మే 18 నుండి 22 వరకూ
ఫీజు చెల్లించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి ఆలోచనల మేరకు మన విద్యార్థులను గ్లోబల్ స్టాండర్డ్స్ లో తీర్చిదిద్దే
విధంగా కృషి చేస్తున్నామన్నారు.
పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ అయన స్కూల్ డేస్
లో చదివిన పద్యాన్ని విద్యార్థుల తల్లితండ్రులకు మోటివేషన్ గా ఉండే విధంగా
చదివి వినిపించారు. దీని సారాంశం ఏమిటంటే ప్రయత్నం చేసే వారికీ ఎప్పటికీ
అపజయం ఉండదని చిన్న అవాంతరాలు ఎదురైనా అధైర్య పడకూడదని ఓటమిని సవాల్ గా
స్వీకరిస్తే, తరువాత విజయం మనల్నే వరిస్తుందని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు.
తల్లితండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు వారిని అధైర్య పరచకుండా
వారిలో మోటివేషన్ తీసుకురావాలన్నారు. పాఠశాల విద్యా శాఖ విద్యార్థులను ఉన్నత
చదువు వైపు పయనించేలా మెరుగైన విద్యా ప్రమాణాలు అందిస్తున్నామని ప్రవీణ్
ప్రకాష్ అన్నారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు, గుర్తింపు కొరకు ఆన్
లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని సింగిల్ విండో ఆన్ లైన్ పోర్టల్‌ను మంత్రి బొత్స
సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ
ప్రైవేట్ పాఠశాలల అనుమతి కొరకు ఆర్ అండ్ బి, ఫైర్, మున్సిపాలిటీ, పంచాయతీ,
రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ శాఖ మొదలగు వారి అనుమతులు పొందవలసి ఉన్నందున ఈ
అనుమతులన్నింటినీ సింగల్ విండో విధానంలో ఆన్ లైన్ ద్వారా పాఠశాల విద్యా శాఖ
నుండి దరఖాస్తు దారుడు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని మంత్రి బొత్స
సత్యనారాయణ అన్నారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ప్రభుత్వ
పరీక్షల సంచాలకులు డి. దేవానంద్ రెడ్డి, డైరెక్టర్ (కో ఆర్డినేషన్) పి.
పార్వతి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె. శ్రీనివాస రెడ్డి, కెజిడివి సెక్రటరీ
మధుసూదన రావు, జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, తదితరులు పాల్గొన్నారు.