ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర చరిత్రను రానున్న రోజుల్లో మార్చే
ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు సిఎం తెలిపారు. ప్రతి ప్రాంతం బాగుపడాలనే
లక్ష్యంతో భోగాపురం విమనాశ్రయ నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. అభ్యుదయానికి
మారు పేరైన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై అభివృద్దికి చిరునామాగా మారుతుందని సిఎం
చెప్పారు.
నెల క్రితమే శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసినట్లు
చెప్పారు. రానున్న రోజుల్లో సీ పోర్టు, ఎయిర్ పోర్టులతో ఉత్తరాంధ్ర తలరాత
మారిపోతుందని చెప్పారు. మరో 24నెలల్లో మూల పేట పోర్టులో పనులు పూర్తవుతాయని
చెప్పారు. ఉత్తరాంధ్ర సీ పోర్టు మణిహారంగా నిలుస్తుందని, భోగాపురం
విమానాశ్రయం ఈ ప్రాంతానికి కిరీటంగా నిలుస్తందని చెప్పారు. భోగాపురంలో ఎయిర్
పోర్టు మాత్రమే కాకుండా మూడు ఉత్తరాంధ్రలోని జిల్లాలకు సమాన దూరంలో
విమానాశ్రయం ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. విజయ నగరంలో
జిల్లాలో 49గ్రామాలు, బోగాపురం విమానాశ్రయానికి తాగునీరు, 30వేల ఎకరాలకు సాగు
నీరు అందించే రూ.195కోట్లతో తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
చేస్తున్నట్లు చెప్పారు. 2024డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు
అంకితం చేస్తామన్నారు.
ఉత్తరాంధ్రలో వలసలకు చెల్లు
చింతపల్లిలో ఫిష్ లాండింగ్ సెంటర్‌ను 24కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు
ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖలో అదానీ డేటా సెంటర్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు
ముఖ్యమంత్రి చెప్పారు. సబ్ మెరైన్ కేబుల్ కనెక్టివిటీ ద్వారా రాష్ట్ర ఐటీ
చిత్రాన్ని మార్చే ముందడుగు పడుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అంటే వలసలు వెళ్లే
శ్రమ జీవులు ఉండే ప్రాంతంగా ఇన్నాళ్లు గుర్తింపు ఉండేదని, ఉత్తరాంధ్ర రానున్న
రోజుల్లో స్థానికంగా విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితులకు
బీజం పడుతుందని చెప్పారు.
ఇతర ప్రాంతాల నుంచి ఇతరులు ఉద్యోగాల కోసం వచ్చే జాబ్ హబ్‌గా ఉత్తరాంధ్ర
ప్రాంతం మారుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే అనేక ప్రాజెక్టులతో
పాటు టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీలలో సాధించే ప్రగతికి ఇంటర్నేషనల్
ఎయిర్ పోర్ట్ కేంద్ర బిందువుగా మారుతుందని చెప్పారు. మూడేళ్లలో ప్రాజెక్టు
పూర్తై 2026నాటికి భోగాపురం నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుందన్నారు.
గతంలో ఎందుకు పనులు ప్రారంభించలేదన్న సీఎం
2026లో మళ్లీ వచ్చి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తానని సిఎం జగన్
ప్రకటించారు. ప్రజల దీవెనలు, ఆశీస్సులు ఉన్నంత కాలం ఎవరెన్ని కుట్రలు పన్నినా
ఎవరేమి చేయలేరన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన చేస్తుంటే
జీర్ణించుకోలేని వారంతా ఏమి మాట్లాడుతున్నారో చూస్తున్నామన్నారు.
గతంలో భోగాపురం విమానాశ్రయం ఎందుకు ముందుకు కదల్లేదో సమాధానం చెప్పాలని
డిమాండ్ చెప్పారు. ఎన్జీటి, సుప్రీం కోర్టు, హైకోర్టు కేసుల్ని
పరిష్కరించుకుంటూ వచ్చి, భూసేకరణ పూర్తి చేసి అన్ని అనుమతులు కేంద్రం నుంచి
తీసుకొచ్చి టెండర్లను పూర్తి చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని
చెప్పారు. గత ప్రభుత్వంలో ఇవేమి చేయకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి
శంకుస్థాపన పేరుతో టెంకాయ కొట్టి పోయారని ఎద్దేవా చేశారు. గతంలోనే టీడీపీ
నాయకులు శంకుస్థాపన చేశామని చెప్పుకోవడం దారుణమన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్
నిర్మాణంలో అన్ని రకాల అడ్డంకులు అధిగమించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు
చెప్పారు. ప్రాజెక్టు పూర్తైన తర్వాత నగరాలతో పాటు ఎయిర్పోర్ట్ కూడా
విస్తరిస్తుందని చెప్పారు.
2026 నాటికి పూర్తి కానున్న నిర్మాణం
2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్టు టేకాఫ్ అవుతుందని చెప్పారు. 7 ఏరో
బ్రిడ్జిలు, ప్యాసింజర్ టెర్మినళ్లు, మరమ్మతులు, అవియేషన్ అకాడమీ, యానిమల్
క్వారంటైన్, కార్గో టెర్మినళ్ల నిర్మాణం 5వేల కోట్లతో నిర్మాణం జరుగుతుందని
చెప్పారు. 60లక్షల జనాభాకు సేవలతో మొదలై నాలుగు కోట్ల మందికి సేవలు అందించేలా
విస్తరిస్తారని చెప్పారు.
ఏ380 డబుల్ డెక్కర్ విమానాలను కూడా సునాయశంగా ల్యాండ్ అయ్యేలా 3.8కి.మీల
పొడవైన రెండు రన్ వేలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ పోర్ట్ పక్కన 500
ఎకరాల్లో ఏరో సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుంచి
విశాఖకు రూ.6300కోట్లతో ఆరు లేన్ల రహదారి నిర్మాణం చేపడతామని చెప్పారు. దీనిపై
ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చలు జరిపినట్లు చెప్పారు.
భోగాపురం విమానాశ్రయం, మూలపేట సీ పోర్టుల వల్ల లక్షల మందికి ఉపాధి
దొరుకుతుందని చెప్పారు. ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించడానికి జిఎంఆర్ గ్రూపు
మల్లిఖార్జున ఇదే ప్రాంతానికి చెందిన వారని, 36 నెలలు కాకుండా 24నెలల్లోనే
పూర్తి చేయగలరా అని తాను అడిగానని, 24 నెలల్లో కాకుండా 30నెలల్లోనే పూర్తి
చేసేందుకు ప్రయత్నిస్తామని జిఎంఆర్ హామి ఇచ్చారన్నారు. గడువుకు ముందే పనులు
పూర్తవుతాయని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుమతులిచ్చిన సింధియా, ప్రధాని మోదీకి సిఎం
కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగు గ్రామాలను పునరావాసం కల్పించామని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో
ఇళ్లను నిర్మించినట్లు సిఎం చెప్పారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రయత్నాలు
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా మార్చామని
చెప్పారు. కిడ్నీ సమస్య పరిష్కారం కోసం ఉద్దానంలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్
పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు చెప్పారు. జూన్‌లోనే కిడ్నీ రిసెర్చ్
సెంటర్ ప్రారంభిస్తామన్నారు.
దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో
ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఇచ్చాపురం, పలాస ప్రాంతాలకు తాగునీటి
అందించేందుకు రూ.700కోట్లతో తాగునీరు అందించే పైప్‌లైన్ పథకాన్ని జూన్‌లోపు
పూర్తి చేస్తామని ప్రకటించారు. పాతపట్నానికి మంచి చేసేలా రూ.265 కోట్లతో
మంచినీటి పథకాన్ని విస్తరించనున్నట్లు సిఎం ప్రకటించారు.
ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలని, ఉత్తరాంధ్రలో ఎప్పుడు జరగని విధంగా కురుపాంలో
ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరు ట్రైబల్ మెడికల్ కాలేజీ నిర్మాణం
జరుగుతోందన్నారు. పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ, నర్సీపట్నంలో మెడికల్
కాలేజీ, విజయనగరం మెడికల్ కాలేజీని ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో
ప్రారంభిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు
కడుతున్నామని సిఎం గుర్తు చేశారు.
సొంత జిల్లాలో నిర్మాణంపై జిఎంఆర్ హర్షం
ప్రపంచంలో చాలా దేశాల్లో తాను విమానాశ్రయాలు కట్టానని, సొంతూరులో విమానాశ్రయం
కట్టే పనులు దక్కడంపై జిఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జున రావు హర్షం
వ్యక్తం చేశారు. తన మొదటి విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయానికి వైఎస్సార్
శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారని, ఆయనే ప్రారంభోత్సవానికి వచ్చారని, ఢిల్లీ
విమానాశ్రయానికి వైఎస్ వచ్చారని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ కుమారుడు చేతుల మీదుగా విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా
ఉందని జిఎంఆర్ చెప్పారు. జగన్ చేతుల మీదుగానే ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం
జరగాలని అకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దార్శనికత, ఈజ్ ఆఫ్ డూయింగ్
బిజినెస్, పోర్టులు, సీ పోర్టుల మధ్య కనెక్టివిటీ విషయంలో ఉన్న దూరదృష్టి
అబినందనీయమన్నారు.
రెండు రకాల ఎయిర్ పోర్టులు ఉంటాయని, బోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, గోవా,తరహాలో 12వ విమానాశ్రయాన్ని
నిర్మిస్తున్నామని జిఎంఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో 99-2000లో 7 విమానాలు ఉంటే
ఇప్పుడు 500 విమానాలు ఉంటున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంతో
తెలంగాణ ఎకానమీ మొత్తం మారిపోయిందని చెప్పారు.
హైదరాబాద్ విమానాశ్రయం మాదిరే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తామని
చెప్పారు. భోగాపురంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నామని చెప్పారు.
రైతులు, మత్స్యకారులు, అన్ని రకాల ఎగుమతులకు అవకాశం ఉంటుందని చెప్పారు.
మూడేళ్లలో విమానాశ్రయాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పారు.
ఢిల్లీ విమానాశ్రయం నిర్మించాక ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగినట్లే భోగాపురంలో
విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. భోగాపురంలో
అద్భుతమైన విమానాశ్రయాన్ని నిర్మించి అందిస్తామని ప్రకటించారు.