పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
రూ.3,500 కోట్లతో విమానాశ్రయ నిర్మాణం
2025 కల్లా పూర్తిచేస్తామన్న మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు భోగాపురం
అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం,
విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్న జగన్ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
చేయనున్నారు. ఈ మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఉత్తరాంధ్ర
అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట
పోర్టుకు ఇటీవలే శంకుస్థాపన చేశామని, ఇప్పుడక్కడ పనులు వేగంగా జరుగుతున్నట్టు
చెప్పారు. అలాగే, రూ. 3,500 కోట్లతో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం 2025
సెప్టెంబరులో పూర్తవుతుందన్నారు. విశాఖ ఐటీ సెజ్‌లోని అదానీ డేటా సెంటర్, ఐటీ
పార్క్, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ వర్సిటీలకు సీఎం నేడు శంకుస్థాపన
చేస్తారని మంత్రి తెలిపారు. కాగా, భోగాపురం విమానాశ్రయానికి ఫిబ్రవరి 2019లో
అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అయితే, అప్పట్లో
రన్‌వేకు సంబంధించిన 40 ఎకరాల భూమి అంశం కోర్టు పరిధిలో ఉండగా, ఇప్పుడు
పరిష్కారమై అనుమతులు వచ్చాయని, అందుకనే ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన
చేయబోతున్నట్టు వివరించారు. రామాయపట్నం పోర్టు కూడా తాము అధికారంలోకి వచ్చాకే
కార్యరూపం దాల్చినట్టు చెప్పారు.