విజయవాడ : కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని వంద పైచిలుకు అనుబంధ కళాశాలల
ప్రాచార్యులకు ఈ విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
ప్రతిపాదనకు అనుగుణంగా నూతన విద్యా విధానాన్ని అనుసరించి డిగ్రీ మూడు ప్రధాన
సబ్జెక్టుల బదులు ఏకైక ప్రధాన సబ్జెక్టు ఉండేలా అన్ని కోర్సులలో పాఠ్య
ప్రణాళిక మార్పులు చేయటానికి అవగాహనా కార్యక్రమం పర్వతనేని బ్రహ్మయ్య
సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. కృష్ణ విశ్వవిద్యాలయం కళాశాలల అభివృద్ధి మండలి
ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా
మండలి వైస్ చైర్మన్ మరియు కృష్ణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్
కె.రామ్మోహన్రావు ప్రధాన వక్తగా పాల్గొని నూతన మార్గదర్శకాలకి అనుగుణంగా
అన్ని కళాశాలలు సమావేశాలు నిర్వహించుకుని తమ కోర్సులను మార్పులు చేసి
విశ్వవిద్యాలయం అనుమతి పొందాలని సూచించారు. ఈ నూతన విధానం విద్యార్థి
కేంద్రీకృతమైందని తద్వారా విద్యార్థులు ఐచ్ఛికాంశాలు ఎంపిక చేసుకుని తమకు
ఆసక్తిగల రంగంలో ఉపాధి అవకాశాలు పొందటానికి అవకాశం లభిస్తుందని వెల్లడించారు.
అనంతరం కళాశాలకు సంబంధించిన ప్రాచార్యులు ఈ నూతన విధానంపై తమ సందేహాలను
నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో కృష్ణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్
ప్రొఫెసర్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యా విధానంలో సంస్కరణల ద్వారా
విద్యార్థులకు అధునాతన రంగాలలో ఉపాధి అవకాశాలు సాధించడానికి వెసులుబాటు
కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం కాలేజ్
డెవలప్మెంట్ కౌన్సిల్ కన్వీనర్, డీన్ డాక్టర్ రామశేఖర రెడ్డి, కళాశాల
డైరెక్టర్ వేమూరి బాబూరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.