కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా),
దీన్ దయాల్ అంథోదయ యోజన – నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ ఆధ్వర్యంలో యస్.యస్.
సొల్యూషన్స్ ట్రైనింగ్ సెంటర్, కడప వారి ద్వారా బ్యూటిషియన్ కోర్స్ శిక్షణ
పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వెల్ఫేర్
శాఖ మంత్రి యస్.బి అంజద్ బాషా, ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూల సంస్థ
(మెప్మా) ఎండీ వి. విజయలక్ష్మి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ
కార్యక్రమం స్థానిక హరిత హోటల్లో ఆదివారం జరిగింది. ఉప ముఖ్యమంత్రి యస్.బి
అంజద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు, మహిళలు అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ఎన్నో
సంక్షేమ పథకాలు మరెన్నో శిక్షణ కార్యక్రమాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా మెప్మా, యస్.యస్.సొల్యూషన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా దాదాపు
52 మంది శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సర్టిఫికెట్ పొందిన మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి స్వయం
ఉపాధి కల్పించాలని, కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి మెరుగైన ఉద్యోగాలు కల్పించే
విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మెప్మా అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చారు.
మెప్మా ఏం డీ విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల
మేరకు రాష్ట్రంలో పట్టణ ప్రాంతంల లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల లోని
సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో యస్.యస్. సొల్యూషన్
ట్రైనింగ్ సెంటర్ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడం
జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కడపలో దాదాపు 52 మంది బ్యూటిషియన్ కోర్స్
పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్, బ్యూటిషన్ కిట్ ఇచ్చామన్నారు. అలాగే
ప్రస్తుతం 90 మంది వివిధ రంగాలలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అలాగే
మంత్రి సూచనలు మేరకు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు స్వయం ఉపాధి, కార్పొరేట్
సంస్థలతో మాట్లాడి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రానున్న రోజుల్లో మరి
కొంతమందికి అవకాశం కల్పిస్తామని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా,
స్టేట్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి సురేష్
రెడ్డి, మెప్మా ఈఎస్టీపీ డీపీఎం టి.నాగరాజు ఎస్ఎస్ సొల్యూషన్స్ ఎండీ బి
శృతి, సిబ్బంది పాల్గొన్నారు.