• తెలుగు నేలపై పుట్టిన కూచిపూడి నృత్యాన్ని ఘల్లు ఘల్లుమని మారుమోగేలా చేసిన
కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ
• ఏపీలో 400 ఏళ్లనాటి ఆలయ నాట్య ప్రదర్శనలను అంతరించిపోకుండా నృత్యరూపకానికి
ప్రాణం పోసిన ప్రాణదాత
• నాట్యాన్ని తరతరాలకు అందించిన ఏకైక వ్యక్తి నటరాజ రామకృష్ణ
• తెలుగు నేలకు, తెలుగు వారు గర్వపడే నాట్యకళ కోసం ఆయన చేసిన కృషి అమోఘం
• ఆంధ్రనాట్యానికి ఆంధ్ర నేల మీద మరణం లేదని చాటి చెప్పిన కళాకారులు నటరాజ
రామకృష్ణ
• 18 ఏళ్లకే అద్భుత నాట్య ప్రదర్శనతో నటరాజ బిరుదు పొందిన నటరాజ రామకృష్ణ
• 700 సంవత్సరాళ్లనాటి పేరిణి శివతాండవ నాట్యానికి పునర్జన్మనిచ్చిన నటరాజ
స్వామి వారసుడు నటరాజ రామకృష్ణ
• 40కి పైగా పుస్తకాలు రచించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తిప్రతిష్టలు
• నటరాజ రామకృష్ణ కలల్ని నిజం చేసేందుకు, ఆయన శిక్షణ ఇచ్చిన కళలను రాబోయే
తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
• తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన కళారంగానికి మంత్రిని కావడం తన పూర్వ జన్మ
సుకృతం
: పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ శత జయంతి ఉత్సవాలు మరియు అంతర్జాతీయ నృత్యం
సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి
ఆర్.కె. రోజా
విజయవాడ : పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ శత జయంతి ఉత్సవాలను ఇకపై ప్రతి ఏటా
నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కె.
రోజా స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య
కళాక్షేత్రంలో భాషా, సాంస్కృతిక శాఖ పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ శత జయంతి
ఉత్సవాలు మరియు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం
నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర
ప్రభుత్వం అధికారికంగా పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ శత జయంతి ఉత్సవాలను
నిర్వహిస్తోందన్నారు. ఇలాంటి గొప్పకళాకారుడిని గౌరవించుకునేందుకు కళాకారిణిగా
తాను గర్వపడుతున్నానన్నారు. తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన కళారంగానికి
సంబంధించిన మంత్రిని కావడం తన పూర్వ జన్మ సుకృతమని భావిస్తున్నానన్నారు. నటరాజ
రామకృష్ణ అంటే భారతీయులు, తెలుగువారికి నటరాజస్వామితో సమానమన్నారు. దేశ
చరిత్రలో ఎంతో మంది కళాకారులున్నప్పటికీ నటరాజ స్వామికి సేవ చేస్తూ తనకు
ఇష్టమైన నాట్యాన్ని తరతరాలకు అందించిన ఏకైక వ్యక్తి నటరాజ రామకృష్ణ అని
ఘంటాపథంగా చాటి చెప్తానన్నారు. అలాంటి మహోన్నత కళాకారుడు తెలుగువారు కావడం
గర్వకారణమన్నారు.
నటరాజ రామకృష్ణ నల్గొండ జిల్లాకు చెందిన దమయంతి దేవి, తూర్పుగోదావరి జిల్లాకు
చెందిన రామ్మోహన్ రావుకు కలిగిన సంతానమని..ఆయన జన్మనిచ్చిన తల్లిదండ్రులకే
కాకుండా తెలుగు నేలకు, తెలుగు వారు గర్వపడే నాట్యకళ కోసం ఎంతో కృషి
చేశారన్నారు. తల్లిదండ్రులు వద్దన్నా ఎన్నో కష్టాలు పడి నాట్యం మీద ఉన్న
ఆసక్తితో చిన్నప్పటి నుండి శాస్త్రీయ నృత్యాన్ని ఆశ్రమాల్లో ఉండి
నేర్చుకున్నారన్నారు. నాట్యకళ అంటే ఆయనకు ఎంత ప్రేమో ఈ ఒక్క ఘటన చాలన్నారు. 18
ఏళ్లకే అద్భుత నాట్య ప్రదర్శనతో ఎంతో మందిని ఆకట్టుకొని ఆ నాటి మరాఠా పాలకుడి
నుండి నటరాజ బిరుదును అందుకున్నారంటే నరనరాన నాట్యం ఎలా ప్రవహిస్తుందో అర్థం
చేసుకోవచ్చన్నారు.
నేటికి నటరాజ రామకృష్ణ జన్మించి 100 యేళ్లు, చనిపోయి 12 యేళ్లు అవుతున్నా
ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన ప్రతిభ, సేవ, తపన, కళాభిమానం
అన్నారు. ఆయన కళను గుర్తించిన కేంద్రం ఆయన్ను పద్మశ్రీ తో గౌరవించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 400 ఏళ్లనాటి ఆలయ నాట్య ప్రదర్శనలను అంతరించిపోకుండా
నృత్యరూపకానికి ప్రాణం పోసిన ప్రాణదాత నటరాజ రామకృష్ణగారని కొనియాడారు. 700
సంవత్సరాళ్లనాటి పేరిణి శివతాండవం నృత్యం కొన ఊపిరిలో ఉన్న ఆ నాట్యానికి
పునర్జన్మనిచ్చిన నటరాజ స్వామి వారసుడు నటరాజ రామకృష్ణ అని అభివర్ణించారు.
తెలుగు నేలపై పుట్టిన కూచిపూడి నృత్యాన్ని ఘల్లు ఘల్లుమని మారుమోగేలాచేసిన
కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ అని తెలిపారు. ఆంధ్ర నాట్యం, ఆంధ్రుల వారసత్వ
సంపదను తరతరాలకు అందించేందుకు ఎంతో మంది శిష్యులను ఆయన తయారు చేశారు. ఈ
ఆంధ్రనాట్యానికి ఆంధ్ర నేల మీద మరణం లేదని చాటి చెప్పిన కళాకారులు నటరాజ
రామకృష్ణ అన్నారు. పేరిణి శివ తాండవం నృత్య రూపాన్ని ఈ లోకంలో శివనామ స్మరణ
జరిగినంత కాలం ఈ నృత్యం బ్రతికే ఉండాలని ఎంతో మంది శిష్యులను తయారు చేసిన
దేవుడు చెక్కిన శిల్పం నటరాజ రామకృష్ణ. కూచిపూడి నృత్యం కలకాలం
విరాజిల్లాలని, వారసత్వ సంపదలా ఆ నృత్యాన్ని ఎంతో మందికి నేర్పిన గొప్ప
కళాకారుడు నటరాజ రామకృష్ణ అని తెలిపారు. ఆయన గొప్ప కళాకారుడే కాదు గొప్ప రచయిత
కూడా అన్నారు. దాదాపు 40కి పైగా అద్భుతమైన పుస్తకాలు రచించి బహుముఖ
ప్రజ్ఞాశాలిగా ఈ తెలుగు నేల చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు.
కచ్చితంగా ఓ కళాకారిణిగా, సాంస్కృతిక శాఖ మంత్రిగా నటరాజ రామకృష్ణ కలల్ని నిజం
చేసేందుకు ఆయన శిక్షణ ఇచ్చిన కళలను రాబోయే తరాలకు అందించేందుకు ఈ ప్రభుత్వం
కృషి చేస్తుందన్నారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా ఇలాంటి కార్యక్రమాలు
నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు. విద్యార్థినీ విద్యార్థులు నృత్యం
చేసేటప్పుడు ముఖ కవళికలు ప్రదర్శిస్తే నాట్యానికి కొత్త అందం వస్తుందని
సూచించారు.
కళారంగానికి జీవితం అంకితం చేసి 72 ఏళ్ల వయస్సులో కూడా ఈ తెలుగు నేల మీద నవ
జనార్ధన పారిజాత నృత్యానికి అభినయ సత్యభామ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత
శ్రీ కళాకృష్ణ గారు తప్ప మరెవరూ న్యాయం చేయలేరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ
కళాకృష్ణ ఆంధ్ర నాట్య నృత్య ప్రదర్శనలిస్తూ ఆ నృత్యాన్ని బతికిస్తూ నటరాజ
రామకృష్ణ గురువుకు ఘన నివాళి అర్పించారన్నారు. ప్రముఖ నాట్యాచారిణి స్వాతి
సోమనాథ్ కళ ఆకర్షించిందన్నారు. అదే విధంగా కూచిపూడి వెంపటి చిన సత్యం కూతురు,
మనమరాలు చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించిందన్నారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పవిత్రమైన భక్తి భావంతో చేసే నృత్యాన్ని
ప్రభుత్వం ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. సాంస్కృతిక శాఖపై ప్రభుత్వం సహకారం,
ప్రోత్సహం మరింతగా ఉండాలన్నారు.భారతీయ, ఆంధ్రుల సంప్రదాయంలో అంతర్భాగమైన
ఆంధ్రనాట్యం, భరతనాట్యం, కూచిపూడి కళలను అంతరించి పోకుండా కాపాడాలనుకున్న
డా.పద్మశ్రీ నటరాజ రామకృష్ణ కృషికి, ఆయన సాంస్కృతిక వారసత్వం కొనసాగిస్తున్న
శ్రీకళాకృష్ణకు ఈ సందర్భంగా హ్యాట్సాఫ్ చెప్పారు.
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు మాట్లాడుతూ కళకు, భాషకు,
సంస్కృతికి, సంప్రదాయాలకు విలువనిచ్చే గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు.కళల పట్ల అవగాహన ఉన్న రోజాకు సాంస్కృతిక
శాఖకు మంత్రిగా నియమించడం సరైన నిర్ణయమన్నారు. జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్
కు కళలకు కాణాచిగా పరిఢవిల్లుతుందన్నారు.
అభినయ సత్యభామ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కళాకృష్ణ మాట్లాడుతూ
తెలుగు ప్రాంతంలో ఉద్భవించిన ఆంధ్రనాట్య కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
తేవడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.నర్తకిగా, నాయకురాలిగా, మంత్రిగా
రోజా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డా.పద్మశ్రీ నటరాజ
రామకృష్ణ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంతర్జాతీయ
నృత్య దినోత్సవంలో భాగంగా విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో ప్రదర్శించిన
శాస్త్రీయ సంగీత నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం నాట్య గురువులను, అభినయ
సత్యభామ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కళాకృష్ణను, ప్రముఖ
నాట్యాచారిణిలను మంత్రి రోజా, ఇతర అతిథులు సత్కరించారు. ఆ తర్వాత మంత్రి
రోజాను వేదికపై ఉన్న అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ముగింపు సమయంలో
శ్రీ కళాకృష్ణ, స్వాతి సోమనాథ్ లతో కలిసి మంత్రి రోజా చేసిన శాస్త్రీయ
నృత్యానికి సభలో హర్షద్వానాలు వెల్లువెత్తాయి.
కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ. అంబటి రాంబాబు, విజయవాడ సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు, , తెలుగు అకాడమీ అధ్యక్షులు నందమూరి
లక్ష్మీపార్వతి, అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ శ్రీ.ఎల్.
జోగినాయుడు, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మీ, ప్రముఖ నాట్యాచార్యులు
శ్రీ ఉమామహేశ్వర పాత్రుడు, ప్రముఖ నాట్యాచారిణి కళారత్న శ్రీమతి శారదా
రామకృష్ణ, శ్రీమతి స్వాతి సోమనాథ్, శ్రీమతి వెంపటి శ్రీమోయి, అధికార భాషా సంఘం
సభ్యులు ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, షేక్ మస్తానమ్మ, భాషా సాంస్కృతిక
శాఖ సంచాలకులు ఆర్. మల్లిఖార్జున రావు, సాంస్కృతిక శాఖాధికారులు, సిబ్బంది,
భారీ ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు