ఘనంగా ఎస్ఆర్ఎం రీసెర్చ్ డే’
రీసెర్చ్ స్కాలర్లకు గోల్డు, సిల్వర్ మెడల్స్ ప్రదానం
గుంటూరు : దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ శాస్త్రీయ పరిశోధనా
సంస్కృతి అతి వేగంగా పెరగాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య
బీజే రావు సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సునిశిత పరిశీలనా తత్వం
పెరగాలనీ, అప్పుడే సమాజ ఉపయుక్తమైన ఆవిష్కరణలు వెలికి తీసేందుకు అవకాశం
ఉంటుందని ఆయన అన్నారు. శనివారం మంగళగిరి మండలం నీరుకొండ ఎస్ఆర్ఎం
యూనివర్సిటీలో 16వ రీసెర్చ్ డే’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన
సదస్సులో ఆచార్య బీజే రావు విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లనుద్ధేశించి
ప్రసంగించారు. దేశం కోసం శాస్త్ర సాంకేతిక పరంగా ఏదైనా చేయాలన్న తపన
విద్యార్థుల్లో పెరిగితే, ఉత్తమ పరిశోధనలు ఆవిష్కృతమవుతాయంటూ, ఆ దిశగా బోధకులు
విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో సంస్థాగత సంస్కృతిని
పెంచడం వల్ల విద్యార్థులు, ప్రొఫెసర్ల మధ్య విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే
తత్వం అలవాటవుతుందన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు కేవలం విద్యార్థులకు
విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల వైపు నుంచీ ఆలోచించాలని సూచించారు.
సీఎస్ఐఆర్-నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ ఆచంట వేణుగోపాల్
మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల బ్రాండ్‌ను నిర్మించేది విద్యార్థులేనన్నారు.
ఏదేని విశ్వవిద్యాలయం గొప్పదనాన్ని దాని పాత విద్యార్థులే
ప్రతిబింబిస్తుంటారన్నారు. బోధన, పరిశోధనల్లో ఏపీ ఎస్ఆర్ఎం ముందుండటం
సంతోషకరమన్నారు. వచ్చే ఏడాది కాలంలో యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్
పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య
మనోజ్కమార్ ఆరోరా పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి
నారాయణరావు మాట్లాడుతూ, గడచిన మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం జాతీయ హైడ్రోజన్
మిషన్, డీప్ ఓషన్ మిషన్, సూపర్ కంప్యూటింగ్ మిషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్
వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాములను ప్రవేశ పెట్టిందనీ, వీటిని జయప్రదం
చేయడానికి యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలన్నారు. ఈ సందర్భంగా వేదికపై రీసెర్చ్
డే సావనీరు ఆవిష్కరించారు.
విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ : ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 30 మంది
స్కాలర్లు, విద్యార్థులకు బంగారు పతకాలు, 12. మందికి రజత పతకాలతో పాటు ప్రశంసా
పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్
ఆర్ ప్రేమకుమార్, డీన్లు డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ విష్ణుపద్, డాక్టర్ రంజిత్
థాపా, రీసెర్చ్ డే కన్వీనర్ డాక్టర్ లక్ష్మీ శిరీష, డాక్టర్ మణికందన్ లు
పాల్గొన్నారు.