మెగా పీపుల్స్ సర్వేలో తిరుగులేని జనాదరణ
175 స్థానాల్లో పోటీచేసే దమ్ము విపక్షాలకు లేదు
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : నాలుగేళ్ళ సంక్షేమ సుపరిపాలనతో కోట్లాది జనం గుండెల్లో సీఎం గా
జగన్ మోహన్ రెడ్డి చెరగని ముద్రవేశారని మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన
శనివారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
ముగింపు సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఏప్రిల్ 7 వ తేదీన, వైఎస్సార్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా “జగనన్నే మా
భవిష్యత్తు” పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించిందని, ఏడు లక్షల మంది
పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజలు వారి కోసం వారి పిల్లల
భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై అభిప్రాయాన్ని సేకరించారని
తెలిపారు.
గతంలో చెప్పినట్లుగా ఈ రోజే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే తుది ఫలితాలను
మీ ముందు ప్రకటిస్తున్నామని సర్వే ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు ఈ
కార్యక్రమంలో రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలు పాల్గొన్నాయన్నారు. జగనన్న
ప్రభుత్వానికి మద్దతుగా 1.1 కోట్లకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని
ప్రకటించడానికి గర్విస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగనన్న
ప్రభుత్వానికి చూపిన మద్దతు చారిత్రాత్మకమే కాక, ప్రజలు స్వచ్ఛందంగా వారి
అభిప్రాయాలు వ్యక్తం చేసిన గొప్ప కార్యక్రమం ఈ మెగా పీపుల్స్ సర్వే అని
అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ క్యాడర్ నిబద్ధత, పట్టుదలతో పని చేసి
ఈ సర్వేని పారదర్శకంగా నిర్వహించారన్నారు. ఈ అద్భుతమైన ఫలితాలతో దేశంలోని ఏ
రాజకీయ పార్టీ చేపట్టలేని అతిపెద్ద పబ్లిక్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు
మెగా పీపుల్స్ సర్వే నిలిచిందని తెలిపారు.
కుల, వర్గ, రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా..
భారీ స్థాయిలో పాల్గొన్నందున సర్వేకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు.
నిష్పక్షంగా సాగిన ఈ సర్వేని నిర్వహించడం ప్రజలను విశేషంగా ఆకట్టుకుందని,
ప్రజల నుంచి వచ్చిన మద్దతుకు రుజువుగా ఈ ప్రజా మద్దతు పుస్తకం విలేకరులకు
చూపారు. ఈ ప్రజా మద్ధతు బుక్లెట్స్ ను చూడండి.. రాష్ట్ర ప్రజలు వారి
భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను మాత్రమే విశ్వశిస్తున్నారని చెప్పడానికి ఇదే
సాక్ష్యం అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగనన్న
నినాదం మారుమోగుతోందన్నారు. సీఎం జగనన్న ప్రభుత్వం అవినీతి రహిత, మధ్యవర్తులు
లేని సంక్షేమ, అభివృద్ధి ప్రభుత్వమని.. దీనికి కారణం సీఎం జగనన్న తెచ్చిన
సంస్కరణల ఫలితమే అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. తాము ఎప్పుడూ
చెబుతున్నట్టు 175 స్థానాల్లో పోటీచేసి గెలిచి తీరుతామని అన్నారు. 175
స్థానాల్లో పోటీచేసే దమ్ము విపక్షాలకు లేదన్నారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ
కట్టుబడి ఉంటుందన్నారు. అన్ని ప్రాజెక్టులూ మా హయాంలోనే పూర్తిచేస్తామని
అన్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వే ఫలితాలు మా ప్రభుత్వ
నిబద్ధతకు ప్రజల నుంచి వచ్చిన ధృవీకరణ, సీఎం జగనన్న పై విశ్వసనీయతకు రుజువుగా
తాము భావిస్తున్నామన్నారు. ఈ మెగా పీపుల్స్ సర్వే ఫలితాలు చూసి విపక్షాలకు
షాక్ కొట్టినట్టయిందన్నారు. ప్రతిపక్షాలు కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లో
కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం విషయంలో వైఎస్సార్ సీపీ న్యాయంగా, నిష్పక్షపాతంగా
వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. సీఎం జగన్ పై తమకున్న
నమ్మకాన్ని స్వచ్చందంగా తెలియజేసి నందుకు రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు. అంతేకాకుండా ఈ సాహసోపేతమైన
కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ క్యాడర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు
తెలియజేస్తున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం మరింత పెంచేలా అదే
శక్తి, అదే ఉత్సాహంతో సుపరిపాలనను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని ధర్మాన
కృష్ణదాస్ వివరించారు.