253 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అంటేనే ప్రజలకు కొండంత నమ్మకమని
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
59 వ డివిజన్ 253 వ వార్డు సచివాలయం పరిధి అజిత్ సింగ్ నగర్లో స్థానిక
కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. 320 గడపలను సందర్శించి ముఖ్యమంత్రి సంతకం చేసిన బుక్ లెట్లను
అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాల
వల్ల ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని మల్లాది విష్ణు తెలిపారు.
ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ ఫలాలు ఏ మేరకు అందాయో తెలుసుకుని ఏదైనా సాంకేతిక
కారణాలతో అందకపోతే అందించడమే అజెండాగా గడప గడపకు కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి గ్రీవెన్స్
స్వీకరించిన ఆయనపలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. శానిటేషన్ అధ్వానంగా
ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితులను తక్షణమే
చక్కదిద్దాలని ఆదేశించారు. పనిచేసే అధికారులు, సిబ్బంది మాత్రమే విధులలో
కొనసాగుతారని, క్షేత్రస్థాయిలో పర్యటించని వారు ఎవరైనా వేటు తప్పదని
హెచ్చరించారు. ఇకనైనా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శం
ఆనాడు మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి
పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
మరలా నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొస్తున్న సంస్కరణలను అనేక
రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థనే ఇందుకు
చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. వాలంటీర్లను గోను సంచులు మోసే ఉద్యోగమని
చంద్రబాబు కించపరిచారని, కానీ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని నారా లోకేష్
చెప్పడం ఈ ప్రభుత్వ విజయంగా చెప్పారు. ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని
పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అప్పుల భారం
పెంచిపోయారని మల్లాది విష్ణు ఆరోపించారు. పేదలను విస్మరించి అస్తమాను విదేశీ
పర్యటనలతో కాలయాపన చేసినందుకే టీడీపీకి ముక్కిమూలిగి 23 సీట్లు వచ్చాయని..
చంద్రబాబును రాష్ట్ర ప్రజలు భరించలేరని తెలిపారు. మంగళగిరిలో తనయుడు ఓటమిపాలైన
రోజే చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
వయస్సు పెరిగినా బాబు బుద్ధి మారలేదు
చంద్రబాబుకు వయస్సు పెరిగినా బుద్ధి మారలేదని మల్లాది విష్ణు విమర్శించారు.
తాడికొండలో ముఖ్యమంత్రిపై ప్రతిపక్షనేత చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా
ఖండించారు. తెలుగుదేశం హయాంలో నాలుగు తాత్కాలిక భవనాలు కట్టి రాజధానిగా
చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో జరిగిన నిర్మాణాలు,
చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత టీడీపీ
ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందన్నారు. సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్
కంపెనీలకు నిధులు మళ్లించి మరీ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని
ఆరోపించారు. చంద్రబాబు పీఏపై జరిగిన ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.2 వేల కోట్ల
బాగోతంపై బాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేదని మల్లాది విష్ణు అన్నారు. అసెంబ్లీ
సాక్షిగా అమరావతిలో జరిగిన అవినీతి బాగోతాన్ని ఈ ప్రభుత్వం బయటపెట్టినా ఇంకా
సిగ్గులేకుండా ప్రతిపక్షనేత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల మనస్సులో
సీఎం జగన్ ని చెరగని ముద్ర అని, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని
ప్రజాభిమానాన్ని చూరగొన్న ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటే ఉపేక్షించేది లేదని
మల్లాది విష్ణు హెచ్చరించారు. 2019 లో కేవలం వైఎస్ జగన్ పై ఉన్న నమ్మకంతో
ప్రజలు 151 సీట్లు ఇచ్చారని.. ఇప్పుడు ఆయన పాలన చూసిన తర్వాత 175 స్థానాలలో
గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్)
శ్రీనివాస్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ
జగదీశ్వరి, నాయకులు నందెపు సురేష్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, కంభగళ్ల రాజు,
కృష్ణ, నాయక్, అఫ్రోజ్, భోగాది మురళి, జయలక్ష్మి, నేరెళ్ల శివ, మేడేపల్లి
ఝాన్సీ, చింతా శ్రీను, అమిత్, గల్లెపోగు రాజు, నాగుల్ మీరా, షఫీ, చింతా
చిన్నా, బాబా, ఈశ్వర్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.