కొత్త డీఏలు ఈ ప్రభుత్వంలోనే రావాలి
ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కలిసి రావాలి
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో నేలపై కూర్చొని బ్రతిమలాడామని,
అయినా ప్రభుత్వం ఇవ్వలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో రౌండ్ టేబుల్
సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు
ఎప్పుడూ ఈ ప్రభుత్వం అనుకూలంగా లేదని, ఈ సర్కార్ చెప్పింది చేయదని
విమర్శించారు. సంఘాలను సమావేశానికి పిలిచి ఈ ప్రభుత్వం అక్కడ మనలో మనకి గొడవలు
పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. మార్చి 9 నుంచి ఉద్యమం అని
ప్రకటిస్తే 7న చర్చలకు పిలిచారని, సమావేశంలో ‘అవన్నీ వినడానికి రాలేదు. మేము
చెప్ప దల్చకున్నది చెప్పివెళతాం’ అన్నారన్నారు. 62 ఏళ్లు రిటైర్మెంట్ కొందరికి
ఇచ్చి మరికొందరికి ఇవ్వరని, ఉద్యోగుల మధ్య ఈ పక్షపాతం సరికాదని బొప్పరాజు
అన్నారు. కొన్ని సంఘాల నాయకులు చర్చలకు వచ్చి కొత్త డీఏల గురించి మాత్రమే
చర్చిస్తారని, సమయం వృధా చేసి మమా అనిపిస్తారని విమర్శించారు. కొందరు నాయకులు
కావాలని అక్కడ డీఏ ప్రస్తావించి ఓకె అనిపిస్తారు. అయితే అదంతా ఉత్తిదేనని ఆయన
అన్నారు. 62 ఏళ్ల రిటైర్మెంట్, పబ్లిక్ సెక్టార్, పీఎస్యూలను పక్కన
పెట్టారన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కలిసి కలవాలని
పిలుపునిచ్చారు. తమిళనాడులో ఎలా ఉద్యోగులు ఏకమవుతారో ఆ విధంగా ఇక్కడ కూడా
అందరూ రావాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కొత్త డీఏలు ఈ ప్రభుత్వంలోనే
రావాలని బొప్పరాజు అన్నారు. కాగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సీఐటీయూ,
ఏఐటీయూసీలు ఉద్యోగులకు మద్దతుగా వచ్చాయి.