స్థానిక ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ఎన్నెన్నో వెసులుబాట్లు
తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో వాణిజ్య పన్నుల శాఖపై మంత్రి బుగ్గన అధ్యక్షతన సమీక్ష
అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన ‘ట్రేడ్ అడ్వైజరీ కమిటీ’ నిర్వహణ
ఏలూరులో రూ.10కోట్లతో ఆర్థిక కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
రాజమహేంద్రవరం : పన్నుల విధింపులో అధికారుల తప్పిదాలు (హ్యుమన్ ఇంటర్ఫేస్),
ప్రభావం లేకుండా ఏపీ అభివృద్ధి చేసిన టూల్ యావత్ దేశానికి ఆదర్శమని ఆర్థిక,
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.స్థానిక
ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ ద్వారా వ్యాపారులకు అనువైన ఎన్నో సంస్కరణలు,
వెసులుబాట్లు తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన స్పష్టం
చేశారు. రాజమండ్రిలో ఆర్థిక మంత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ‘ట్రేడ్
అడ్వైజరీ కమిటీ’లో మంత్రి బుగ్గన మాట్లాడుతూ పన్నులకు సంబంధించి భారతదేశ
వ్యాప్తంగా ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల పరిష్కారంలో ఏపీ ముందంజలో ఉందని
స్పష్టం చేశారు. ట్రెజరీ అడ్వైజరీ కమిటీ నిర్వహణ, మానవతప్పిదాలపై స్పందన,
పన్ను విధింపులు, వసూళ్లపై అధికారులకు సరైన శిక్షణ లేకపోవడం వలన వాణిజ్య
పన్నుల శాఖ అధికారులకు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు
చేశారు. వాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర
ప్రభుత్వం దృష్టి సారించి వాణిజ్యవేత్తలకు స్నేహపూర్వక వాతావరణాన్ని
ఏర్పరిచిందన్నారు. బ్రిటీష్ కాలంలోని చింతచెట్టు చట్టం ప్రకారం, పెరట్లో చింత
చెట్టు సహా ఎక్కడ ఏ చింత చెట్టును కొట్టివేయాలన్నా కలెక్టర్ అనుమతి
తీసుకోవాలన్న నిబంధన ఉండేదని అలాంటి చింతపండుపై పన్ను విధింపు సరికాదని
కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోగలిగామని గుర్తు చేశారు.
చింతపండు, మామిడిపండు, గుజ్జు , ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ సహా అనేక
స్థానిక ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు, సంస్కరణలు, పన్ను
తగ్గింపులు,సవరణలు, ఫిట్ మెంట్ లు సాధించున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని
చెప్పడానికి గర్వపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఢిల్లీలో ఇటీవల పన్నుల విధానం,
సంస్కరణలపై ఏపీ ఇచ్చిన ప్రజంటేషన్ చూసి ఆంధ్రప్రదేశ్ పనితీరులో అన్ని
రాష్ట్రాల కన్నా ముందుందని కేంద్ర ఆర్థిక శాఖ మెచ్చుకున్న విషయాన్ని మంత్రి
వివరించారు.గతంలో అధికారులకు కోపమొస్తే, వ్యాపారవేత్తతో స్నేహాన్ని బట్టి
‘సీవీటీ’లు జరిగేవన్నారు. కానీ ఇపుడు ‘సీవీటీ’ జరగాలంటే ప్రధాన కార్యాలయానికి
సమాచారం లేకుండా జరగని పారదర్శక విధానం ఏపీలో తీసుకువచ్చామన్నారు.డిపార్ట్
మెంట్ కు డీలర్ కు మధ్య మంచి సంబంధాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి
తెలిపారు.పన్నుల అమలు విషయంలో డీలర్ ఫ్రెండ్లీగా ఉండాలనేదే సీఎం జగన్ మోహన్
రెడ్డి మార్గనిర్దేశం చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.
అనంతరం దేశంలోనే ఎక్కడా లేని ‘మోడల్ ఎనలిటిక్స్ సిస్టం’ ఏపీలో ఏర్పాటైందని
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. అడిషనల్ కమిషనర్
స్థాయి అధికారి ఆధ్వర్యంలో డేటా ఎనలిటిక్స్ వింగ్ ఏర్పాటు ప్రభుత్వ
స్నేహపూర్వక శైలికి నిదర్శనమన్నారు.’ఐటీ టూల్స్’ సహకారంతో అధిక పన్నులు,
మినహాయింపులు లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. పరిశీలన,
ఆడిటింగ్ ల అనంతరం కొన్ని సందర్భాలలో వచ్చే అనుమానాలను మరింత లోతుగా
విశ్లేషించే కమిటీ వ్యవస్థ ఏర్పాటైనట్లు వివరించారు. రూ.100కోట్లకు పైగా
పన్నులు కట్టే వారి కోసం ప్రత్యేకంగా జాయింట్ కమిషనర్ కార్యాలయంలో సీనియర్
డిప్యూటీ కమిషనర్, ప్రధాన కమిషనరేట్ లో ఇద్దరు జాయింట్ కమిషనర్ల ఆధ్వర్యంలో
నిరంతర సహకారం అందించే వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు.ఆదాయం ఆధారంగా అధికారుల
నియామకం, 6 సర్క్యూట్ లు, 3 డివిజన్ లు, 3 జోన్ ల వారీ అడిషనల్ కమిషనర్
స్థాయి అధికారిని నియమించి ఆడిటింగ్, ఇన్స్ పెక్షన్ ల విషయంలో వెసులుబాటు
దిశగా అడుగులు వేస్తున్నట్లు గిరిజా శంకర్ పేర్కొన్నారు. మామిడి
పండు,చింతపండు, బెల్లం వంటి సహా అనేక పన్ను విధింపుల వాణిజ్యాంశాలను కేంద్రం
దృష్టికి తీసుకువెళ్ళి వాణిజ్యవేత్తలకు ఉపశమనం కలిగించడంలో మంత్రి బుగ్గన చొరవ
ప్రశంసనీయమన్నారు.
వాణిజ్య పన్నుల శాఖపై ఉన్నతాధికారులతో మంత్రి బుగ్గన అధ్యక్షతన సమీక్ష
జీఎస్టీపై అధికారులు, సిబ్బంది మరింత అవగాహన పెంచుకోవాలని ఆర్థిక, వాణిజ్య
పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు.రాజమండ్రిలో పన్ను వసూళ్ల
తీరును మంత్రి ఆరా తీశారు.పలు వస్తువులపై విధిస్తున్న పన్నుల గురించి వివరాలను
అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. రాజమండ్రిలో కమర్షియల్ టాక్స్ శాశ్వత
భవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో స్థల సేకరణ
చూపిస్తే తగు చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ
సంక్షేమం, సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన
వేణుగోపాలకృష్ణ,ఎంపీ వంగా గీత, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి,
వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి గిరిజా శంకర్, మున్సిపల్ కమీషనర్
కే.దినేష్ కుమార్, రాజానగరం, గోపాలపురం, కాకినాడ అర్భన్ శాసన సభ్యులు
జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మూడు జిల్లాల
వాణిజ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో రూ.10కోట్లతో ఆర్థిక కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఏలూరులో రూ.10కోట్లతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఆర్థిక కార్యాలయ
భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. జిల్లా
కలెక్టరేట్ లో 26,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఫ్లోర్లలో ఆర్థిక శాఖ
విభాగాలన్నీ ఒకే చోట కొలువుదీరడం సంతోషకరమన్నారు. దీని వల్ల అధికారులకు
సమయాభావం లేకుండా వెసులుబాటు కలగడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వ సేవలందించడంలో
మరింత వేగం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
ఆర్కిటెక్చర్ బోర్డు సూచించిన ప్రమాణాలు, ప్రభుత్వ విధానాల ప్రకారం భవన
నిర్మాణం జరిగిందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్,ఇతర సదుపాయాలు మొదటి
అంతస్తులో ట్రెజరీ, రెండో అంతస్తులో ట్రెజరీ, ఏపీజీఎల్ఐ, మూడో అంతస్తులో
ఆడిటింగ్ విభాగాలున్నాయన్నారు. గతంలోగా ప్రభుత్వ భవనాలు ఇష్టం వచ్చినట్లు
కాకుండా..ఆర్కిటెక్చర్ బోర్డు ఏర్పాటు , ఆ సూచనలతోనే భవన నిర్మాణాలు జరగడం
ఏపీలో ప్రప్రథమన్నారు. ఖర్చు , ఉద్దేశం, లక్ష్యం, ఆకృతులు, వాతావరణ
పరిస్థితులు, ఉపయోగం,అనుకూలతలన్నీ పరిశీలించే వ్యవస్థే ఆర్కిటెక్చర్ బోర్డని
మంత్రి వివరించారు. ఆర్థిక శాఖ భవనంలో సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ లిఫ్ట్,
ప్రమాద నివారణ సదుపాయాలు ప్రత్యేకమన్నారు. గతంలో ప్రభుత్వ భవనాలు,
కార్యాలయాలకు భిన్నంగా కార్యాలయ వాతావరణం , వెలుతురు, సహా వసతులకు పెద్దపీట
వేసి నిర్మించినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఈ
కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక
శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, జాయింట్
కలెక్టర్ లావణ్య వేణి, సీఎఫ్ఎంఎస్ సీఈవో సునీల్ తదితరులు పాల్గొన్నారు.