నిర్మల్, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ లో భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ లో చేరేందుకు వివిధ పార్టీల
నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న
అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల అమితంగా ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ , బీజేపీ
పార్టీలకు చెందిన యువత కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. నిర్మల్
నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ , కాంగ్రెస్ నాయకులు,
కార్యకర్తలు, యువకులు, మైనార్టీ వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్,
బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో
చేరారు. బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో వారందరికీ గులాబీ
కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. నర్సాపూర్ మండల
కేంద్రంతో పాటు రాంపూర్ గ్రామం, సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన సుమారు
300 మంది యువకులు, మైనార్టీకి వర్గానికి చెందిన పలువురు గులాబీ గూటికి
చేరారు.
నిర్మల్ అభివృద్ధి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికే సాధ్యమని బీఆర్ఎస్ పార్టీలో
చేరుతున్నట్లు వారు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ..
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాయకత్వానికి అండగా మరోసారి నిర్మల్ గడ్డపైన
ఇంద్రకరణ్ రెడ్డి గెలిపించుకోవడమే లక్ష్యంగా గులాబీ గూటికి చేరినట్లు
వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో సీఎం
కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా ఎంతో
అభివృద్ధి సాగిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం
సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గతంలో తెలంగాణ నుంచి
వలసలు ఉండేవని, ఇవాళ రైతు సంక్షేమ పథకాలతో వలసలు ఆగి రైతులు
ఆర్థికంగా నిలదొక్కుకున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇవాళ
వేలాదిమంది బతుకుదెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతరపార్టీల నుంచి
నేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ వైపు పరుగులుపెడుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం గురించి యువత
ఆలోచించాలని, తెలంగాణ ఏర్పడక మునుపు ఎలాంటి పరిస్థితులు ఉండేవని గుర్తు
చేశారు. తెలంగాణ వచ్చాక సీయం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో ప్రగతి
పథంలో దూసుకుపోతున్నామని, వీటన్నింటిని ప్రజలు గమనించాలని కోరారు.
అభివృద్ది, సంక్షేమం, ప్రజల బాగు కోసం ఏం చేస్తున్నామే చెప్పి బీఆర్ఎస్
పార్టీ ఓట్లు అడుగుతుంటే… బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు మాత్రం యువతను
రెచ్చగొట్టి వారి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయని ఆగ్రహం
వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలను బీజేపీ పార్టీ నాయకులే ప్రోత్సహిస్తూ …
వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ది, సంక్షేమంతో పాటు ప్రజల మేలు కోసం ఏం చేస్తామే చెప్పి ఓట్లు
అడగాలని హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ
నాయకులు కుల, మతాల పేరు చెప్పి ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం
గడుపుకోవడం మానుకుని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని కోరారు.