విజయవాడ : వాక్ ఫర్ లైబ్రరీస్ (గ్రంథాలయాల కోసం పుస్తకంతో నడక) కార్యక్రమాన్ని
జులై 5వ తేదీన రాష్ట్రం మొత్తం పల్లెల్లో, పట్టణాల్లో చేస్తున్నట్లు
ఆంధ్రసారస్వత పరిషత్ నిర్ణయించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు గజల్ మ్యాస్ట్రో
డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలియజేశారు. మంగళవారం మంగళగిరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్
పౌర గ్రంథాలయాన్ని శ్రీనివాస్ సందర్శించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్
మందపాటి శేషగిరిరావును శ్రీనివాస్ కలిసి, తమ సంస్థ చేయబోయే వినూత్న
కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ యొక్క స్ఫూర్తిదాయకమైన
భాగస్వామ్యాన్ని కోరుతూ ఛైర్మన్‌కి లేఖ ఇచ్చారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ ని
మర్యాద పూర్వకంగా మందపాటి శేషగిరిరావు సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్
గ్రంథాలయాల ఉద్యమంపైన, గ్రంథాలయాల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఒక
చక్కని పాట పాడతానని ప్రకటించారు. అనంతరం జరిగిన ప్రెస్మీట్లో డాక్టర్ గజల్
శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి కోసం, విద్యార్థులను గ్రంథాలయాలకు
మరింత దగ్గర చేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సామాజిక
సాహిత్య సేవా సంస్థల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేయాలనుకుంటున్నట్టు
తెలిపారు. గ్రంథాలయం అందరికీ సంబంధించింది కాబట్టి, గ్రంథాలయో రక్షతి రక్షితం
అని మనందరం ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. గతంలో నేను గ్రంథాలయ
శాఖలో పనిచేశాను. నాకు అన్నం పెట్టిన సంస్థ రుణం తీర్చుకునే అవకాశం ఇలా రావడం
ఆనందంగా వుందన్నారు.
గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ డాక్టర్ గజల్
శ్రీనివాస్ గ్రంథాలయ పరిషత్ కు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రంథాలయాల డిజిటలైజేషన్ ప్రక్రియ
మొదలుపెట్టి విజయవంతంగా కొనసాగుతున్న శుభసందర్భంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్
గ్రంథాలయాల అభివృద్ధి కోసం వాక్ ఫర్ లైబ్రరీస్’ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప
శుభపరిణామమన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.