నూతన జాయింట్ కలెక్టర్ ల కోసం ఒక రోజు సర్వే పునశ్చరణ సదస్సు
విభిన్న అంశాలపై పూర్తి స్ధాయి అవగాహన కలిగించేలా తరగతులు
గుంటూరు : భూసర్వే ఫలాలు ప్రజలకు చేర్చటంలో జిల్లా సంయిక్త పాలనాధికారులు
ముఖ్యమైన భూమికను పోషించవలసి ఉందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం
అన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇటీవల జిల్లా సంయిక్త పాలనాధికారులుగా
(జాయింట్ కలెక్టర్) బాధ్యతలు స్వీకరించిన ఐఎఎస్ అధికారుల కోసం తాడేపల్లి లోని
విపత్తుల నిర్వహణ సంస్ధ కార్యాలయం వేదికగా నిర్వహించిన భూసర్వే పునశ్చరణ
సదస్సును ఆయన మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన
అజేయ కల్లం మాట్లాడుతూ అధికారులు ప్రజాసేవతో ప్రజల మనస్సులలో సుస్ధిర స్ధానం
సంపాదించుకోగలుగుతారన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ప్రారంభమైన వైఎస్ ఆర్
జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకం ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా నిరంతర
సమన్వయం, ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరమన్నారు.
ప్రణాళికా బద్దంగా భూముల రీసర్వే ను చేపట్టటం ద్వారా ఆ ఫలాలు ప్రతి ఒక్కరికీ
చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని భూపరిపాలన చీఫ్ కమీషనర్, ప్రభుత్వ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అన్నారు. జిల్లా సంయిక్త పాలనాధికారుల
సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆయన దోషాలకు తావులేని రీతిలో ఎవ్వరూ వేలెత్తి
చూపని రీతిలో భూసర్వే పూర్తి చేయాలన్నారు. భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్
కమీషనర్ సిద్దార్ధ జైన్ మాట్లాడుతూ భూసర్వే ఫలితంగా అత్యధిక సంఖ్యలో గ్రామ
సర్వేయర్లను నియామకాలు చేసి, వారికి 82 రకాల రీసర్వే శిక్షణలు ఇవ్వడం ద్వారా
శాఖను మరింత పటిష్టపరచుకోగలిగామన్నారు. ఈ మానవవనరులను పూర్తి స్దాయిలో
సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలన్నారు. అదునాతన సాంకేతిక సర్వే పరిజ్ణానం వినియోగంలో సైతం ఆంధ్రప్రదేశ్
దేశంలోనే ముందంజలో ఉందని, సర్వేయర్లకు డ్రోన్ పైలట్లగ శిక్షణ ఇచ్చి వారిని
డ్రోన్ ఫైలెట్లుగా వినియోగించుకుంటున్నామని అన్నారు. ఒక రోజు పునశ్చరణ
సదస్సులో సర్వే, సరిహద్దు చట్టంపై సిద్దార్ధ జైన్ అవగాహన కల్పించగా, ఆర్ఓఆర్
చట్టం, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై అదనపు సిసిఎల్ఎ ఎండి ఇంతియాజ్ సంయిక్త
కలెక్టర్లకు వివరించారు. పంచాయతీ రాజ్ కమీషనర్ సూర్య కుమారి, సర్వే శాఖ అదనపు
సంచాలకులు రోణంకి గోపాలకృష్ట స్వమిత్వ కార్యక్రమం గురించి దిశా నిర్దేశం
చేసారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు కార్స్, రోవర్స్ అంశాలను
విపులీకరించగా, సర్వే ఐటి కార్యక్రమాల గురించి రచన తెలిపారు. సర్వే అకాడమీ
వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ఎన్ విఎస్ కుమార్ , కాకినాడ ఆర్ డిడి కెజియా కుమారి ,
కేంద్రకార్యాలయం డిడి ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.