అమరావతి : ఈనెల 29వ తేదీ శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో
సా.5గం. లకు రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో
భాగంగా పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వారి శతజయంతి ఉత్సవాలు, అంతర్జాతీయ నృత్య
దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈశతజయంతి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర
సృజనాత్మకత, సంస్కృతి సమితి ప్రచురించిన గోడపత్రికను మంగళవారం వెలగపూడి
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
ఆవిష్కరించారు.పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ దశాబ్దాల పరిశోధనతో ఒక గొప్ప
సాంప్రదాయాన్ని తిరిగి ఆవిష్కరించడంలో కీలకపాత్ర పోషించారు. అదే విధంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కళారూపాలను అంతరించి పోకుండా కాపాడారు. వీరి
నిస్వార్ధ సహకారం లేకుంటే కూచిపూడి నృత్యం నేడు ఇంతటి ప్రసిధ్ధి చెంది ఉండేది
కాదు. ఆంధ్రనాట్యం (టెంపుల్ డ్యాన్స్)పునరుద్ధరణ మరియు ప్రచారం అయి ఉండేది
కాదు.అలాగే 11వ శతాబ్దపు కాకతీయ సామ్రాజ్యపు యోధుల నృత్యం అయిన పేరిణి
శివతాండవం ప్రాణం పోసుకుని ఉండేది కాదు పున:సృష్టించపడేది కాదు.
అంతేగాక ప్రాచీన యక్షగాణమైన చిందు మరోసారి ప్రాచుర్యం పొంది ఉండేది కాదు. ఈ
మహానుభావుడికి కళపట్ల అపరిమితమైన అభిరుచి కనక లేకుంటే గోల్కొండ కోటలోని కుతుబ్
షాహి కాలం నాటి ప్రసిద్ధ బ్యాలెట్ ధియేటరైన తారామతి ప్రేమవతి కళామందిర్ అసలు
వైభవానికి తిరిగి వచ్చేది కాదు. సంక్షిప్తంగా చెప్పాలంటే భారతీయ చరిత్ర పుటల
యొక్క లోతుల్లో స్తంభింపబడిన ఆంధ్రుల గొప్ప సాంస్కృతిక వారసత్వ ప్రపంచానికి
సుపరితం అయ్యేది కాదు. ముఖ్యంగా ఆంధ్రనాట్యం ఆరామాలు, దేవాలయాలు, రాజుల
ఆస్థానాల్లో అంకితమైన సంస్కృతి కలిగిన మహిళా కళాకారిణిచే ప్రదర్శించబడిన
పురాతన ఆలయ నృత్య సాంప్రదాయం. ఈలాస్య సంప్రదాయం వల్లే తెలుగు నేల ఎంతో
పురాతనమైనదని తెలుస్తోంది. ఇక డా.నటరాజ రామకృష్ణ జీవిత విశేషాలను ఒకసారి
పరిశీలిస్తే ఆయన ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. అయన
వారి కుటుంబాన్నీ సంపదల్నీవదిలి నాట్యం కోసం జీవితాన్ని అంకితం చేశాడు.ఆయన
తనలోని కళాతృష్ణా న్వేషణలో గురువుల నుండి నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు.
వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి,నాయుడుపేట
రాజమ్మ,పెండెల సత్యభామలు ఉన్నారు. 18 ఏళ్ళ వయసులో నాగపూరులో ఆయనకు “నటరాజ” అనే
బిరుదును ఇచ్చారు.అప్పటి నుండి అది ఆయన పేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.
సినీనటుడు తిక్కవరపు రమణారెడ్డి ఆహ్వానం మేరకు నెల్లూరు వెళ్ళి అక్కడ నృత్య
నికేతనం అనే నాట్య శిక్షణా లయాన్ని స్థాపించాడు.తనకు నాగపూరులో మత విద్వేషాలు
పరిచయమే గానీ కుల విద్వేషాలు మాత్రం కొత్తగా ఉందని నెల్లూరులో ఉండగా నటరాజ
రామకృష్ణ వ్యాఖ్యానించాడు. అక్కడి కుల వైషమ్యాలను తట్టుకోలేక వెనక్కి పోదామని
అనుకోగా రమణారెడ్డి వారించిన మీదట ఆగాడు. రెండు సంవత్సరాలు నెల్లూరులో ఉన్న
తరువాత గుంటూరు తరలి వెళ్ళాడు. నటరాజ రామకృష్ణ రామప్ప దేవాలయం లోని శిల్పాల
వలన ఉత్తేజితుడై పదవ శతాబ్దం లో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న
పేరిణి నృత్యాన్నిపునరుద్ధరించాడు. జాయప సేనాని రాసిన నృత్యరత్నావళి
గ్రంథాన్ని ఇందుకు మార్గదర్శినిగా ఎంచుకున్నాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి
సంబంధించిన నవ జనార్దనంను కూడా పునరుద్ధరించాడు.
పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ ఇచ్చిన నాట్య ప్రదర్శనలు ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర
కల్యాణం,కుమార సంభవము, మేఘ సందేశం.ఉజ్జయినిలో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి
స్వర్ణ కలశం లభించింది.నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభైకి పైగా పుస్తకాల్లో
ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్య
కళాచరిత్ర, ఆంధ్రులు నాట్యకళారీతులు ప్రసిద్ధ గ్రంథాలు. ఆంధ్రప్రదేశ్ నాటక
అకాడమీకి ఛైర్మన్గా ఉన్న నటరాజ రామకృష్ణ యాభై ఏళ్ళపాటు నాట్యకళను ముందుకు
నడిపించాడు. ఆంధ్ర నాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయం చేయడంలో పేరు
తెచ్చుకున్నాడు.నటరాజ ఆంధ్రనాట్యం,పేరిణి నృత్యాల పురోగతికై లక్షా ఏభై వేల
రూపాయలతో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం సంస్థను నెలకొల్పాడు.దీని ద్వారా
వర్ధమాన వృద్ధ కళాకారులకు ధన సహాయం,పింఛను అందజేశారు. అంతేగాక రామకృష్ణ అనేక
మంది దేవదాసి నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను
అధ్యయనం చేశాడు.
అభినయ సత్యభామ శ్రీ కళాకృష్ణ
నటరాజ రామకృష్ణ వారి ప్రియశిష్యుడైన కళాకృష్ణ ఆంధ్రనాట్య నృత్య శైలిపై పూర్తి
ప్రావీణ్యం కలిగిన అత్యుత్తమ కళాకారుడే కాకుండా ఈనృత్య రీతిపై పూర్తి
పరిజ్ణానం,ప్రతిభ కలిగిన ఏకైక కళాకారునిగా ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు
పొందారు. స్త్రీ వేషంలో వీరు ఆంధ్రనాట్య కళను ప్రదర్శిస్తూ ప్రపంపంచంలోనే
అత్యున్నతమైన కళాకారునిగా పేరు గాంచారు. కళాకృష్ణ ఆంధ్రనాట్యం యొక్క తన నృత్య
ప్రదర్శనల ద్వారా భారతదేశ గొప్ప సాంస్కృతిక వార సత్వాన్నిప్రదర్శించ గల
సామర్ధ్యం కలిగి ఉన్నారు. ఆయన దేశ విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
కళాకృష్ణ అనేక బిరుదులు,గౌరవాలు పొందారు.1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వం కళా కృష్ణను నిధి అవార్డుతో సత్కరించింది.హైదరాబాదు కూచిపూడి ఆర్ట్
అకాడమీ నుండి బంగారు పతకం,ఆరాధన నుండి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు,స్థానం
నర్సింహరావు అవార్డు,హైదరాబాదు నుండి రసమయి అంతర్జాతీయ నృత్య దినోత్సవ అవార్డు
వంటి పలు అవార్డులు,నాట్య రంగానికి అందించిన సేవలకు పులు సాంస్కృతిక సంస్థలు
కళాకృష్ణను సత్కరించాయి.
పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాలు మరియు అంతర్జాతీయ నృత్య దినోత్సవ
గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమీషనర్ ఎస్.సత్య నారాయణ,రాష్ట్ర
సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సిఇఓ ఆర్.మల్లిఖార్జున, దేవాదాయశాఖ అధికారులు
తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు సచివాలయం రెండవ బ్లాకులో రాష్ట్ర ప్రభుత్వ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ గోడపత్రికను పరిశీలించారు.