అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు
ఉపయోగించుకుంటూనే సొంత ఆదాయాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి సూచించారు. తాడేపల్లిలోని
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 27
పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులను కమిషనర్ సన్మానించి అవార్డులను
అందజేశారు. పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాల కల్పన, హెల్దీ పంచాయతీ, చైల్డ్
ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియెంట్ పంచాయతీ, క్లీన్ అండ్ గ్రీన్
పంచాయతీ, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ, సోషియల్లీ
సెక్యూర్డ్ పంచాయతీ, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ కేటగిరీల్లో అవార్డులను
ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి
సాధించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ
పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం
నుంచి దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చేసిన
ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైనవారు
వీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్లు సుధాకర్‌రావు,
డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.