ఉమ్మడి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి పాలమూరు జిల్లాలో నాడు
బీజాలు నాటింది ఏపీయూడబ్ల్యూజే సంఘమేనని, దాని వారసత్వంతో తెలంగాణలో పురుడు
పోసుకున్న టీయుడబ్ల్యుజె అదే స్ఫూర్తితో పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర
వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ
అన్నారు. ఇవ్వాళ జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
యూనియన్ ముఖ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు దశాబ్దాలకు పైగా
సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగివున్న తమ సంఘం వేలాది జర్నలిస్టుల ఆదరాభిమానాలు
పొందుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. ఎవరెన్ని కూతలు కుసినా, ఐక్యత,
పోరాటాలు, త్యాగాల కలయికే టీయుడబ్ల్యుజె లక్ష్యమన్నారు. అహర్నిశలు శ్రమిస్తూ,
నీతి, నిజాయితీ, నిర్భీతితో తాము సేవలందిస్తున్నందువల్లే జర్నలిస్టుల విశ్వాసం
పొందగలుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 33జిల్లాల్లో తమ సంఘానికి
ఎదురులేదని, అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా దేశ
స్థాయిలో పేరుగడించడం గర్వంగా ఉందన్నారు. సంఘ చరిత్రను నెమరేసుకుంటూ, నిరంతరం
జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలపై ఉంటుందన్నారు.
రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు మే 10లోపు జిల్లా మహాసభల ప్రక్రియ పూర్తి
చేయాలని విరాహత్ సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దతేందర్ అధ్యక్షతన
జరిగిన ఈ సమావేశంలో, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్ రావు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
రవీందర్ రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి.మధు గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా
కార్యదర్శి రామాంజనేయులు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జి.సుదర్శన్
రెడ్డి, గద్వాల జిల్లా అధ్యక్షుడు శ్యామ్, నారాయణపేట జిల్లా కన్వీనర్
యాదన్నలతో పాటు ఆయా జిల్లాల ముఖ్యనాయకులు
ఈ సమావేశంలో పాల్గొని మూడు జిల్లాల మహాసభల తేదీలు ఖరారు చేసారు. ఈ సమావేశానికి
ముఖ్యఅతిథిగా హాజరైన విరాహత్ అలీని సత్కరించి ఆత్మీయతను పంచుకున్నారు.