గుంటూరు : రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు చేస్తూ ఉద్యోగులను పక్కదారి
పట్టిస్తున్నారని ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి. ఎస్ దివాకర్ విమర్శించారు.
ఆదివారం తాడేపల్లి పూజిత కాన్ఫరెన్స్ హాల్ నందు ఎ.పి. రెవిన్యూ జే ఏ సి
చైర్మన్ వి. యస్. దివాకర్ అధ్యక్షతన ఎ.పి. రెవిన్యూ, జే ఏ సి సభ్య సంఘాల
అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర కార్యవర్గంతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ.పి.జె.ఎ.సి అమరావతి పేరుతో బొప్పరాజు ప్రభుత్వంపై
చేస్తున్న ఉద్యమాలు అన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలని, ఈ నిరసన
కార్యక్రమాల్లో ఏపీ రెవిన్యూ జే.ఏ.సి పాల్గొనడం లేదనన్నారు. వీటిలో భాగంగానే ఈ
నెల 18, 25, 29 వ తేదీలలో అన్ని జిల్లాల కలక్టరు కార్యాలయాల వద్ద ధర్నాలు,
నిరసనలు చేపడతామని ఇచ్చిన పిలుపు పూర్తిగా రాజకీయ అజెండా అని, బహిరంగ చర్చకు
సిద్ధం అని బొప్పరాజుకి తెలియజేస్తున్నామన్నారు.
ప్రభుత్వం ఇప్పటకే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూర్చింది. మరోన్నో
ప్రయోజనాలు తొందరలోనే నెరవేరుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బొప్పరాజు
చేస్తున్న ఉద్యమాల పట్ల ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులందరూ అప్రమత్తంగా
ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వై.యస్.ఆర్ ప్రభుత్వం
రాగానే ఒక ప్రభుత్వరంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు
చెల్లిస్తున్నారని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ జగన్ మోహనరెడ్డి పై పూర్తి
కృతజ్ఞతతో ఉన్నప్పటికీ , వారిని రెచ్చగొట్టి కలక్టరేట్ ల పిలుపు ఇవ్వడం
బొప్పరాజుకు తగదని, గతంలో ఉద్యోగ భద్రతా లేకుండా 7 లేదా 9 నెలలకు ఒక్కసారి
జీతాలు వచ్చేటప్పుడు బొప్పరాజు ఏమైపోయాడని ప్రశ్నించారు. రెవెన్యు శాఖలో అన్ని
తరగతులు ఉద్యోగులకు డిప్యుటీ కలక్టర్ల వరకు పదోన్నతులు కల్పించడం జరిగినదని,
గ్రామ రెవెన్యు సహాయకులను గ్రామ రెవెన్యు అధికారులుగా, గ్రామ రెవెన్యు
అధికారులను సీనియర్ సహాయకులుగా, తహశిల్దారులకు డిప్యుటీ కలక్టర్ లుగా
పదోన్నతులు కల్పించడం జరిగినదని, ప్రభుత్వ వ్యతిరేకంగా ఏటువంటి
కార్యక్రమాలల్లో పాల్గొనమని చెప్పారు. ఉద్యోగులకు అన్ని రకములుగా ప్రయోజనాలు
ఈ ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ బొప్పరాజు ఒక బోగస్ ప్రచారానికి తెరలేపారని
అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉద్యోగికి ప్రతి నెల సక్రమంగా జీతాలు
వస్తున్నప్పటికీ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులను
రెచ్చగొట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నారుని, ఉద్యోగులపై ఒత్తిడి
తెస్తున్నారని మా దృష్టికి వచ్చిందన్నారు.
ఉద్యోగుల మనోభావాలతో ఆడుకోవద్దని బొప్పరాజుని హెచ్చరించారు. సుమారు 50వేలకు
మించి వైద్య శాఖలోని నియామకాలు, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం ద్వారా
సుమారు లక్ష అరవై వేల పైబడి ఉద్యోగాలు కల్పించి ప్రొబేషన్ ను డిక్లేర్ చేసిన
శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించిందని అన్నారు.1998 డిఎస్సి క్వాలిఫైడ్
అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 4000 మందికి నియమాక పత్రాలు
అందజేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఏ రాష్ట్రంలోను లేని విధంగా
ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారని కోవిడ్ కష్ట కాలంలో ఆర్టీసీ బస్సులు
తిరగనప్పటికీ జీతాలు సక్రమంగా చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ
కార్యక్రమంలో ఏపీ వీఆర్ఏ అసిస్టెంట్స్ రాష్ట్ర అధ్యక్షులు జి ధైర్యం, ఏపీ
రెవెన్యూ కంప్యూటర్ ఆపరేటర్స్ రాష్ట్ర అధ్యక్షులు జే సూరిబాబు, ఏపీ డైరెక్ట్
వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి జోసెఫ్, ఏపీ సర్వేయర్స్ అసోసియేషన్
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డి సాయిబాబు, ఏపీ వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర
జనరల్ సెక్రెటరీ సత్యరాజు రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ సంఘాల అధ్యక్షులు
కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.