రాగిజావకు బదులు చిక్కీ లేని రోజుల్లో కూడా పాఠశాల విద్యార్థులకు చిక్కీని
అందించనున్నాం
విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో రాగిజావను అందించడం ఆచరణ సాధ్యం
కాదు కాబట్టే ఈ నిర్ణయం
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
విజయవాడ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట బడులు, పరీక్షల నిర్వహణ
నేపథ్యంలో స్కూళ్లు ఉదయం 11.15 గంటల వరకు మాత్రమే ఉంటున్న కారణంగా
విద్యార్థులకు రాగి జావకు బదులు చిక్కీలు అందించాలని విద్యాశాఖ నిర్ణయించిందని
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఒక
ప్రకటనలో తెలిపారు.
ఇళ్లకు వెళ్లే ముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న నేపథ్యంలో
ప్రత్యేకంగా రాగిజావను అందించే బదులు వారికి చిక్కీ లేని రోజుల్లో కూడా
చిక్కీని అందించే నిబంధనను తెచ్చి ప్రతిరోజూ చిక్కీలను ఇవ్వాలని
నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో
రాగిజావను అందించడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వెల్లడించారు.అంతేగాక పాఠశాల ముగిసే సమయానికి మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా
రెండూ ఒకేసారి తినడం కష్టమన్నారు. అదే విధంగా పరీక్షలు పూర్తయిన తర్వాత
విద్యార్థులు ఇంటికి తిరిగి వెళ్లడానికి తొందరపడతారని ఆ సమయంలో ప్యాక్ చేయబడిన
చిక్కీని విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉండటం కారణంగా రాగిజావకు
బదులు చిక్కీని అందించనున్నామన్నారు.
రాగి జావ తక్కువ తీపి ఉందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆచార్య ఎన్జీ
రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ / ఫుడ్ క్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా,
పోషకాహార నిపుణులతో విస్తృత చర్చలు జరిపి వారి సలహాల మేరకే ఇప్పుడున్న రాగి
పిండి, బెల్లం నిష్పత్తి నిర్ణయించడం జరిగిందని, ఆ తర్వాతే ఈ నిర్ణయానికి
వచ్చినట్లు వివరించారు. పాఠశాలల నుండి వచ్చే తదుపరి ఫీడ్బ్యాక్ ఆధారంగా
సవరణలు పరిశీలించబడతాయని ఆయన తెలిపారు.
ముందుగా నిర్ణయించిన మేరకు వారంలో మూడు రోజులు రాగిజావను, మూడు రోజులు
చిక్కీని ఇస్తుండగా ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రతి రోజూ(6
రోజులు) చిక్కీని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జగనన్న గోరుముద్దలో భాగంగా
ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొన్న విధంగా వచ్చే విద్యా సంవత్సరం
ప్రారంభం నుండే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగి జావ పంపిణీని పునః
ప్రారంభిస్తామని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో IMMS యాప్ ద్వారా
పొందిన డేటా ప్రకారం, 21-03-2023 నుండి 18-04-2023 వరకు 97.67% విద్యార్థులు
రాగిజావను స్వీకరించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.