పింఛన్లు తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
అంగన్వాడీలలో నాడు – నేడు పనులపై సీఎం సమీక్ష
అమరావతి : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ
చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న
ఖాళీలనూ భర్తీ చేయాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో
గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలలో నాడు-నేడు పనుల
ప్రగతిపై సీఎం ఆరా తీయగా ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా
అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన సుమారు
45వేల అంగన్వాడీలలోనూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేయాలని సీఎం నిర్దేశించారు.
పింఛన్లు తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీ : ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన
పనులు, సదుపాయాలపై ప్రతిపాదనలు తయారుచేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్
అధికారులను ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా
అంగన్వాడీల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రోత్ మానిటరింగ్
ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ
ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్నారు. పింఛన్లు
తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీని సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులను
మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన
పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం ఆదేశించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో జరిగిన ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు
సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య
కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల
విద్యాశాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్
సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ
డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు
సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.