విజయవాడ : డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ లో భాగంగా, 2023 – 24 ఆర్ధిక
సంవత్సరానికి గాను వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం ను పొడిగిస్తూ రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సి.ఆర్. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమి
ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి కి
ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇందువల్ల గతం లో వున్న మార్గదర్శకాలకు
అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులకు, వారి పై ఆధార పడిన కుటుంబ సభ్యులకు నగదు
రహిత వైద్య సేవలు అందించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
ఎంపిక చేసిన హాస్పిటల్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా అవసరమైన
వైద్య సేవలు పొందే వీలు కలుగుతుందన్నారు. ఈ పథకం అమలులో వర్కింగ్ జర్నలిస్టుల
క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్
ట్రస్ట్ సి.ఈ.ఓ హరీంద్ర ప్రసాద్ హామీ మేరకు 104 హెల్ప్ లైన్ లో ఒక ప్రత్యేక
లైన్ ఏర్పాటు కూడా వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో అందు బాటు లోకి వస్తుందని
ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకాన్ని
సద్వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.