విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని
2023-24 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 18.04.2023న జీవో యం.యస్ నెం. 48 ను
జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి బుధవారం
ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు
ఇప్పటికే 31.03.2023న జీవో నంబర్ 38 జారీ చేసిన విషయం గుర్తుచేస్తూ కొత్తగా
అక్రిడిటేషన్ కార్డును పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద
ప్రీమియం పైకం రూ.1,250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద
తెలిపిన పద్దుకు చెల్లించి 31.03.2024 వరకు లబ్ధి పొందవలసిందిగా కమిషనర్
సూచించారు.
Head of Account: 8342-00-120-01-03-001-001
DDO Code: 2703-0802-003
ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న
రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ జిరాక్సు కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ
బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని రెండవ ఫ్లోర్ లో ఉన్న సమాచార
పౌర సంబంధాల శాఖ, కమిషనర్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే
సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో
అందజేయాల్సిందిగా కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు
వాటా రూ.1,250, ప్రభుత్వం వాటా రూ.1,250 అన్నారు. భార్య/భర్త, పిల్లలు,
జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఈ స్కీమ్
లో భాగంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్ ను నిర్వహిస్తూ జర్నలిస్టులు చేసిన వైద్య
ఖర్చులను రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్
ట్రస్ట్ సదరు రీయింబర్స్ మెంట్ క్లెయిమ్స్ ను పథకం విధివిధానాలను అనుసరించి
సెటిల్ చేస్తుందన్నారు.
జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ
సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ
చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు
లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్
స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) తరహాలో వైద్య
సేవలు పొందవచ్చన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే
వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్ధేశిత
చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ పథకానికి
వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా అదే విధంగా సమాచార
పౌర సంబంధాల శాఖ కమిషనర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.
అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని
కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి కోరారు.