స్కాలర్షిప్ విధానంపై ప్రశంస..
గుంటూరు : కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్
కోర్సుల్లో ప్రవేశానికై ఈ నెల 27 నుంచి మే 5 వ తేదీ వరకు నిర్వహించనున్న
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల
రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరుకుని
వేలాది విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య, నైపుణ్యాలను అందించటం విశేషమని
అన్నారు. సరళమైన, సృజనాత్మక విద్యా విధానం ద్వారా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా,
జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యా సంస్థగా పేరు దక్కించుకుందని కొనియాడారు.
ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం, కమ్యూనికేషన్ సామర్ధ్యం చాలా అవసరమని,
విద్యార్థులు పరిశోధనల పట్ల మరింత శ్రద్ద పెంచుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు మౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని,
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు అనేక పధకాలను రూపొందించమని
చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత విద్య, యువతకు ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యత
ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం మన రాష్ట్ర విద్యార్థులు ఇతర
రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నాణ్యమైన విద్య ఇక్కడ అందుబాటులో ఉందని
రామకృష్ణారెడ్డి అన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సాహించేలా కె ఎల్ విద్యా
సంస్థ రియపొందించిన స్కాలర్షిప్ ప్రణాళిక ఆమోదయోగ్యంగా ఉందని, ఈ విధానం ద్వారా
అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే
క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా అత్యధిక ప్యాకేజీలు పొందిన విద్యార్థులకు ఆయన
అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ సారధి
వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, ఎం హెచ్ ఎస్ విభాగం
డీన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.