ఏ సాయం కావాలన్నా భేషజాలు లేకుండా నన్ను అడగండి
ముస్లిం సోదరులతో మంత్రి ఆర్కేరోజా
నగరి : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,
యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి రోజా తన నివాసం వద్ద నియోజకవర్గంలోని
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన
సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముస్లీం సోదరులను తన ఇంటికి పిలిచి ఇఫ్తార్ విందు
పెట్టాలన్న కోరిక ఉండేదని అది నేడు తీరిందన్నారు. రంజాన్ పండుగను ముస్లీం
సోదరులు ఉపవాసం ఉంటూ అతి పవిత్రంగా నిర్వహిస్తారని వారిని పిలిచి విందు
పెట్టాలని ఆహ్వానించానన్నారు. తన ఆహ్వానానికి విలువ నిచ్చి ముస్లీం సోదరులతో
పాటు అంతగా బయటకు రాని ముస్లీం మహిళలు కూడా వారి ఆడపడుచుగా నన్ను భావించి
పెద్ద ఎత్తున విచ్చేసారని వారి అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
తనను వారింటి బిడ్డగా భావించాలని ఏ సాయం అవసరమైనా ఏ భేషజాలు లేకుండా తనను
అడగవచ్చన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం సోదరులు ఓటు బ్యాంకుగా మాత్రమే
భావించారన్నాను. వైఎస్సార్, జగనన్న మాత్రమే వారి అభివృద్ధిని
ఆకాంక్షించారన్నారు. నేడు అభివృద్ధి పరంగానే కాక రాజకీయంగా వారికి తగిన
ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రస్తుత బజ్టెట్లోను మైనార్టీ ఫైనాన్స్
కార్పొరేషన్‌కు 715 కోట్లు, ఇమామ్స్ అండ్ మౌజాన్స్ల ప్రోత్సాహకంగా 126
కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. పుత్తూరులో షాదీ మహల్ నిర్మాణం జరుగుతుండగా
వడమాలపేటలో ఈద్గా ప్రారంభించామన్నారు. నగరి మండలంలో ముస్లీం సోదరులు నివశించే
మీరాసాహెబ్ పాళెంను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. నగరిలోని షాదీ మహల్
నవీకరణకు కూడా త్వరలో జరుగుతుందన్నారు. ప్రతిరోజూ ముస్లీం సోదరులు
ప్రార్థనల్లో భాగంగా రోజా చేస్తారని తన పేరుకూడా రోజా అని అందరి ఆశీర్వాదం
తనకు ఉండాలని కోరారు. తన ఇంటికి విచ్చేసి ప్రార్ధనలు చేసి ఆశీర్వదించిన ప్రతి
ఒక్కరికి కృతజ్ఞతలతో పాటు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ
కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ షంగిలి షన్మోహన్
మాట్లాడుతూ అర్హులైన మైనారిటీ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి
చేస్తానన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి, కలెక్టర్
ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు.