ఏపీ సీఐడీ పరిధి దాటి నోటీసులు ఇచ్చింది
వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి మద్దతు
విజయవాడ : ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా
పలుచోట్ల న్యాయవాదులు నిరసనకు దిగారు. బెజవాడ బార్ అసోసియేషన్‌తో పాటు
మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, తిరువూరు, ఏలూరు, కొవ్వూరు తదితర కోర్టుల్లోనూ
న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఛార్టెర్డ్ అకౌంటెంట్
కె.శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంపై విజయవాడలో ఏపీ ప్రొఫెషనల్ ఫోరం
ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన
న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని న్యాయసమాజం ముక్తకంఠంతో
తప్పుబట్టింది. విజయవాడ కోర్టు వద్ద బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా
చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు చలసాని అజయ్‌కుమార్, గొట్టిపాటి
రామకృష్ణప్రసాద్, సుంకరి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సీఐడీ చర్యలను ఖండించారు. ప్రాథమిక హక్కులు
ప్రమాదంలో పడ్డాయని, తమ నోరు నొక్కేయడం సరికాదని నినాదాలు చేశారు. ప్రజల
హక్కులను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. సీఐడీ నోటీసులకు ఎట్టిపరిస్థితుల్లోనూ
భయపడబోమని తేల్చిచెప్పారు. ఈ విషయంలో తమ పోరాటం ఆగదని న్యాయవాదులు స్పష్టం
చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్య సరైందా? లేదా? అనే అంశంపైనే రౌండ్‌టేబుల్
సమావేశం జరిగిందన్నారు. సీఐడీ మాత్రం తన పరిధి దాటి న్యాయవాదులకు నోటీసులు
ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు
ఆడుతున్నారని మండిపడ్డారు. సీఐడీ నోటీసులను తీవ్రంగా ఖండిస్తున్నామని, వాటిని
బేషరతుగా ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి మద్దతు : మరోవైపు న్యాయవాదుల నిరసన కార్యక్రమంలో
వైసీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదులకు సీఐడీ నోటీసులు
ఇవ్వడం దురదృష్టకరమని, ఈ పోరాటానికి మద్దతుగా నిలుస్తానని ఆయన చెప్పారు. ఏ
పార్టీ అధికారంలో ఉన్నా ఇలా నోటీసులు ఇవ్వడం తగదన్నారు. ఇది వ్యక్తులు,
పార్టీలకు సంబంధించిన అంశం కాదని గౌతమ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.