రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు
విజయనగరం : జిల్లాలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తో బాల్య వివాహాలను
పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్
కేసలి అప్పారావు పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నిర్మూలనపై శనివారం ఎంపీడీవో
కార్యాలయంలో మహిళ శిశు అభివృద్ది శాఖ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఇలాంటి
సమయంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి పూర్తి స్థాయి అవకాశం
ఉందన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేసి పూర్తిస్థాయిలో బాల్య
వివాహాలను అదుపు చేయాలన్నారు. అధికారులు ఉదాసీనంగా ఉండటం వల్ల బాల్య
వివాహాల నిర్మూలన అమల్లో విఫలమవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. బాల్య వివాహాలు చేసిన
వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మహిళా పోలీస్
సిబ్బంది తరుచుగా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
మండల అధ్యక్షురాలు అప్పల నరసమ్మ మాట్లాడుతూ
బాల్య వివాహాలకు గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. ప్రాజెక్టు
డైరెక్టర్ శాంతకుమారి మాట్లాడుతూ బాల్య వివాహాలపై మరింత అవగాహన
రావాలన్నారు. మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాల
నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ
కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి, జెడ్పిటీసి శిరీష, ఎంపీడీవో రామకృష్ణ రాజు,
పీవో రాజరాజేశ్వరి, సామాజిక పరివర్తన మార్పు సమాచార వ్యవస్థ జిల్లా సమన్వయ
అధికారి బి. రామకృష్ణ, ఎవో రమణ మూర్తి, కర్లం వైద్యాధికారిణి, వైసిపి నాయకులు
ఇప్పిలి అనంతం, శ్రీనివాసరావుతో పాటు పలువురు సర్పంచ్ లు, అంగన్వాడీ
కార్యకర్తలు, ఎ ఎన్ ఎంలు తదితరులు పాల్గొన్నారు.