నగర మేయర్ తో కలిసి రూ. 19.71 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విజయవాడ నగరానికి పునర్
వైభవం వచ్చిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. 31వ డివిజన్ టీచర్స్ కాలనీ 3వ లైన్, శ్రీనగర్
కాలనీ 4వ లైన్లలో రూ. 19.71 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారులను నగర
మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంలతో కలిసి
శనివారం ఆయన ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో రహదారుల నిర్వహణను కనీసం
పట్టించుకోకపోవడంతో.. నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని
ఇబ్బందికరంగా తయారయ్యాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఫలితంగా చిన్నపాటి
వర్షానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. కానీ వైఎస్సార్
సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రాంతమంతా నూతన రహదారులతో
కళకళలాడుతోందన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ
ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పసుపుతోట పార్కు రోడ్డును ఇటీవల
ప్రారంభించుకున్నట్లు గుర్తుచేశారు. రానున్న రోజుల్లో నగరాన్ని మరింత సుందరంగా
తీర్చిదిద్ది భావితరాలకు అద్భుతమైన నగరాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నగరంలో పెనుమార్పు వచ్చిందని
తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో నియోజకవర్గంలో
అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. నగర
సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో
ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, నాయకులు మురళీకృష్ణం రాజు, బెజ్జం రవి, మానం
వెంకటేశ్వరరావు, జయకర్, ఆకెళ్ల శ్రీను, కడవకొల్లు వెంకటేశ్వరరావు, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.