ఆర్టీసీ హౌస్ లో అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు
ముఖ్య అతిధిగా పాల్గొన్న మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. ద్వారకా తిరుమల రావు
విజయవాడ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132 వ
జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ
వేడుకల్లో ముఖ్య అతిధిగా సంస్థ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు పాల్గొని
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా
నివాళులు అర్పించారు. అనంతరం వేడుకలకు హాజరైన సంస్థ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, తదితరులు ఆయనకు పూలు జల్లి
నివాళులు అర్పించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ. కోటేశ్వరరావు
అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఆర్టీసీ
హౌస్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ డా. బి
ఆర్. అంబేద్కర్. భావి తరాలకు మార్గదర్శకమైన రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడని
కొనియాడారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ ఓటు అనే గొప్ప ఆయుధాన్ని రాజ్యాంగంలో
పొందుపరచడం ద్వారా ఆయన అందించారని, స్వేఛ్చ, సమానత్వం కోసం పరితపించిన
మహోన్నతుడని కీర్తించారు. ప్రపంచ దేశాల్లో మన రాజ్యాంగానికి చాలా ప్రాముఖ్యత
ఉన్నదని, దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత అంబేద్కర్ దని వ్యాఖ్యానించారు.
విద్య యొక్క గొప్పతనం తెలుసుకుని అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని ఆయన 2
సంవత్సరాల పాటు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రచించారని, అటువంటి మహానుభావుడు
మన దేశంలో జన్మించడం నిజంగా మనందరికీ గర్వకారణమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ
సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా బలోపేతమవ్వాలని, అందరికీ ప్రాధమిక హక్కులు
కల్పించాలని, వివక్ష లేకుండా అందరికీ సమన్యాయం జరగాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఆయన
రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. రాజ్యాంగం రాయడమే గొప్ప విషయమైతే,
దానిలోని ప్రతి అంశాన్ని ఆమోదించుకోవడం మరొక గొప్ప విషయమన్నారు. భవిష్యత్తు
తరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడి గొప్ప తనాన్ని గుర్తించి,
మరణానంతరం “భారతరత్న” ఇవ్వడం మన దేశం ఇచ్చిన నిజమైన నివాళి అని ప్రశంసించారు.
అంబేద్కర్ గొప్పతనానికి నిదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాకు ఆయన
పేరు పెట్టడం జరిగిందన్నారు. బాబాసాహెబ్ ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని
ముందుకెళ్ళాలని, ఆ విధంగా నడుచుకోవడమే మహనీయులకు మనం ఇచ్చే నిజమైన నివాళి
అన్నారు.
అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ. కోటేశ్వర రావు మాట్లాడుతూ దాదా
సాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ భారత జాతికి దిక్సూచి అని కొనియాడారు.
దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప విద్యా వేత్త అని ప్రశంసించారు. భోదించు,
సమీకరించు, పోరాడు అనే నినాదంతో స్ఫూర్తి నింపారన్నారు. ప్రతి ఒక్కరూ
విద్యావంతులు కావడం ద్వారా సమాజంలో ఉన్నత వ్యక్తిత్వం గల వారుగా
తీర్చిదిద్దబడుతారని ఆయన సందేశం ఇచ్చారన్నారు. ఈ జయంతి ఉత్సవాలలో సంస్థ లోని
ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, బి.సి. వెల్ఫేర్ అసోసియేషన్, వివిధ
అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొని వారి సందేశాలను అందించారు. అనంతరం ఎం.డి
నేతృత్వంలో ఆర్టీసీ ఎంతో పురోగతి సాధించిందని కొనియాడి పలువురు అసోసియేషన్ల
ప్రతినిధులు ఆయనకు చిరు సత్కారం చేశారు. హెడ్డాఫీస్, పి.ఓ.(హెచ్.ఆర్.డి.)
మాణిక్యం ఆద్వర్యంలో నిర్వహింపబడిన ఈ వేడుకలలో సంస్థ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్(ఇ) పి. కృష్ణ మోహన్, ఎ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) శోభామంజరి,
సి.టి.ఎం. నాగేంద్ర ప్రసాద్, సి.ఇ. ఐటి వి.సుధాకర్, హెడ్డాఫీసు అధికారులు,
ఉద్యోగులు పాల్గొన్నారు.