ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్ర శేఖర్
గుంటూరు : భారత రాజ్యాంగం ద్వారా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన రాజ్యాంగ
నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు భారత రాష్ట్ర సమితి కృషి చేస్తోందని ఆ
పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
హైదారాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తు గల డాక్టర్
అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సిఎం
కేసిఆర్ ఈనెల 14న అంబేడ్కర్ జయంతి రోజున ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం
ద్వారా కేసిఆర్ అంబేడ్కర్ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారన్నారు.
36 ఏకరాల్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మృతివనం లో అంబేడ్కర్ జీవిత విశేషాలు
సూచించే అంబేడ్కర్ మ్యూజియం, లైబ్రరీ,యోగా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు
తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా
భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగు
ప్రజలు పాల్గొనేందుకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు సహా రాష్ట్రంలోని
పలు ప్రాంతాలనుండి హైదరాబాదు కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు
తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగు ప్రజలందరూ పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.